tammineni: భారతి పేరును చార్జ్ షీట్ లో చేర్చాల్సిన అవసరం ఏమొచ్చింది?: వైసీపీ నేత తమ్మినేని
- ఏడేళ్ల తర్వాత ఈ కేసులో ఆమెను నిందితురాలిగా చూపడం సరికాదు
- ఈడీతో టీడీపీ నాయకులు కలిసి పనిచేస్తున్నారు
- ఈడీ కేసుల విషయం ఎల్లో మీడియాకు ఎలా తెలిసింది?
భారతీ సిమెంట్స్ కేసులో జగన్ సతీమణిని నిందితురాలిగా చేరుస్తూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జ్ షీట్ ను దాఖలు చేసినట్టు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, భారతి పేరును చార్జ్ షీట్ లో చేర్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ఈడీని ప్రశ్నించారు.
జగన్ కు వస్తున్న విశేష ప్రజాదరణ చూసి టీడీపీ ప్రభుత్వం, ఆ వర్గం వారు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. టీడీపీ నేతలకు ఈడీ అధికారులు బంధువులు అని, వారిని టీడీపీ తన చెప్పుచేతల్లో ఉంచుకుంటోందని ఆరోపించారు. ఈడీతో టీడీపీ నాయకులు కలిసి పనిచేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడేళ్ల తర్వాత జగన్ సతీమణి భారతిని ఈ కేసులో నిందితురాలిగా ఈడీ చూపడం సరికాదని అన్నారు. జగన్ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారని, జగన్ ని కేసుల్లో ఇరికించి అడ్డు తొలగించుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు. ఏడేళ్ల తర్వాత భారతి పేరును చార్జ్ షీట్ లో ఎలా చేరుస్తారో ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇధ్దరు ఈడీ అధికారులు టీడీపీకి ఏజెంట్లు
ఇద్దరు ఈడీ అధికారులు టీడీపీకి ఏజెంట్లుగా పనిచేస్తున్నారని, ఉమా శంకర్ గౌడ్, బోస్ అనే ఇద్దరు అధికారులతో టీడీపీకి లీకులు అందుతున్నాయని తమ్మినేని ఆరోపించారు. ఈడీ కేసుల విషయం ఎల్లో మీడియాకు ఎలా తెలిసిందని ప్రశ్నించారు. భారతి సిమెంట్స్ లో మెజారిటీ వాటాను ఫ్రాన్స్ కు చెందిన కంపెనీ వికా కొనుగోలు చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.