Arvind Kejriwal: ఏ కూటమిలోనూ మా పార్టీ చేరబోదు: కేజ్రీవాల్
- 2019 లోక్ సభ ఎన్నికల్లో ఏ కూటమిలోనూ చేరం
- వచ్చే ఎన్నికలలో ఆప్ ఒంటరిగానే పోటీ చేస్తుంది
- ఢిల్లీలో ప్రతి అభివృద్ధి పనికి కేంద్రం అడ్డుతగులుతోంది
2019 ఎన్నికలలో బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్ష పార్టీలు ఒకే తాటిపైకి వచ్చి, ఓ కూటమిని ఏర్పాటు చేయాలని భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా చేరుతుందా? అనే ప్రశ్నకు ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్ స్పందించారు. హరియాణాలోని రోహ్ తక్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, 2019 లోక్ సభ ఎన్నికల్లో ఏ కూటమిలోనూ తమ పార్టీ చేరబోదని స్పష్టం చేశారు. ఈ కూటమిలోని పార్టీలకు దేశాభివృద్ధిలో ఎలాంటి కీలక పాత్ర ఉండదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
హరియాణా అసెంబ్లీ ఎన్నికలలోనూ, సాధారణ ఎన్నికలలోను ఆప్ అన్ని స్థానాల నుంచి ఒంటరిగానే బరిలోకి దిగుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో ప్రతి అభివృద్ధి పనికి కేంద్రం అడ్డుతగులుతోందని, కేంద్రం వల్లే చాలా పనులు పెండింగ్ లో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో విద్య, ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చామని, ఢిల్లీ కంటే హరియాణా చాలా వెనుకబడి ఉందని అన్నారు. నాలుగు రోజుల క్రితం జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి చెందిన సైనికుడి (హరియాణాలోని అంబాలాకు చెందిన వ్యక్తి) కుటుంబానికి నష్టపరిహారం కింద కోటి రూపాయలు ఇవ్వాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.