Rs. 2000 Note: రూ. 2 వేల నోటును ఉపసంహరించుకోవడం లేదు.. స్పష్టత నిచ్చిన ప్రభుత్వం
- నల్లధనం నిరోధానికి ప్రభుత్వ చర్యలతో సత్ఫలితాలు
- పరిస్థితులు ఆశాజనకంగా ఉన్నాయి
- ఆర్థిక శాఖ సహాయమంత్రి వివరణ
నోట్ల రద్దు తర్వాత ప్రవేశపెట్టిన రెండు వేల రూపాయల నోటును ఉపసంహరించుకోబోతున్నట్టు వస్తున్న వార్తలపై కేంద్రం మరోమారు స్పష్టత ఇచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పొన్ రాధాకృష్ణన్ శుక్రవారం లోక్సభలో మాట్లాడుతూ.. రూ.2 వేల నోటును ఉపసంహరించుకునే ఉద్దేశం కేంద్రానికి లేదని స్పష్టం చేశారు. ఈ నోటును ఉపసంహరించుకోబోతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు.
దేశంలో పెరిగిపోతున్న నల్లధనానికి అడ్డుకట్ట వేసేందుకు అప్పట్లో ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. ప్రస్తుతం పరిస్థితులు ఆశాజనకంగా ఉన్నాయని, ఇటువంటి పరిస్థితుల్లో రెండు వేల రూపాయల నోటును ఉపసంహరించుకునే ఉద్దేశం కేంద్రానికి లేదని మంత్రి స్పష్టం చేశారు.