Odisha: మానవత్వం మళ్లీ మరణించింది.. కేన్సర్‌తో పోయాడని మోసేందుకు ఒక్కరూ రాలేదు!
- ఏడాది క్రితం కేన్సర్ బారినపడిన బెహరా
- పరిస్థితి విషమించడంతో గురువారం మృతి
- సాయం చేసేందుకు ఒక్కరు కూడా ముందుకు రాని వైనం
మనం పేరుకే నాగరికులమని, ప్రవర్తన మాత్రం అనాగరికంగా ఉంటోందని చెప్పే మరో ఘటన ఒడిశాలో జరిగింది. అభివృద్ధి పరంగా దూసుకుపోతున్నామని రోజూ ఢంకా బజాయించుకుని చెబుతున్నా మూఢనమ్మకాల నుంచి బయటపడలేకపోతున్నామని నిరూపించే ఘటన ఇది. కేన్సర్ బారిన పడిన ఓ వ్యక్తి మరణిస్తే శ్మశానానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఒక్కరంటే ఒక్కరు కూడా రాలేదు. దీంతో ఆయన కుమారుడు ఓ కర్రకు తండ్రి మృతదేహాన్ని కట్టి పెదనాన్న కుమారుడితో కలిసి శ్మశానానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాడు. విషయం తెలిసి అందరూ నివ్వెరపోయారు.
కేంఝర్ జిల్లాని బరడపాకు చెందిన దుశ్శాసన్ బెహరా (55) ఏడాదిగా కేన్సర్‌తో బాధపడుతున్నాడు. ఆసుపత్రుల చుట్టూ తిప్పినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీనికి తోడు ఖర్చును భరించలేక అతడిని ఇంటికి తీసుకొచ్చారు. ఈ నెల మూడో తేదీన బెహరా ఆరోగ్యం మరింత క్షీణించింది. నోటిలో పుండు పడి పురుగులు కనిపించాయి. ఈ విషయం గ్రామస్థులకు తెలియడంతో గ్రామస్థులు ఎవరూ ఆ ఇంటి వైపు రావడం మానేశారు.
పరిస్థితి మరింత విషమించడంతో గురువారం రాత్రి బెహరా మృతి చెందాడు. విషయాన్ని గ్రామ పెద్దలకు తెలిపిన అతడి కుమారుడు అంత్యక్రియలకు సాయం చేయాల్సిందిగా కోరాడు. అయితే, ఒక్కరంటే ఒక్కరు కూడా అతడికి సాయం చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో శుక్రవారం ఉదయం పెదనాన్న కుమారుడితో కలిసి వెదురుబొంగుకు తండ్రి మృతదేహాన్ని కట్టి శ్మశానానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించాడు.