Supreme Court: రాజీవ్ హంతకుల విడుదలకు ఒప్పుకుంటే అంతే సంగతులు!: సుప్రీంకు చెప్పిన కేంద్రం
- ప్రమాదకర సంకేతమన్న కేంద్రం
- తప్పుడు సంప్రదాయం మొదలవుతుందని వెల్లడి
- సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో ఏడుగురు దోషుల్ని విడుదల చేయాలన్న తమిళనాడు ప్రభుత్వ ప్రతిపాదనకు తాము అంగీకరించబోమని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలిపింది. ఒకవేళ వీరిని విడుదల చేస్తే ప్రమాదకరమైన సంప్రదాయానికి తెరతీసినట్లు అవుతుందని వెల్లడించింది. ఈ కేసులో దోషులుగా ఉన్న మురుగన్, సంతమ్, అరివు, జయకుమార్, రాబర్ట్ పయస్, పి.రవిచంద్రన్, నళినిలను విడుదల చేస్తే.. అంతర్జాతీయంగా విపత్కర పరిణామాలు ఎదురవుతాయని చెప్పింది. భవిష్యత్ లో ఇతర నేరస్తులు కూడా ఇదే బాటలో పయనించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ నవీన్ సిన్హా, జస్టిస్ కేఎం జోసెఫ్ ల ధర్మాసనం ముందు కేంద్రం అఫిడవిట్ ను దాఖలు చేసింది.
రాజీవ్ హంతకులపై ఎలాంటి కనికరం చూపించాల్సిన అవసరం లేదని కేంద్రం సుప్రీంకు తెలిపింది. 1991, మే 21న తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్ లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన రాజీవ్ గాంధీని ఎల్టీటీఈ ఉగ్రవాదులు మానవబాంబుతో హత్యచేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రాజీవ్ తో పాటు మరో 15 మంది అధికారులు, నేతలు దుర్మరణం చెందారు.