Telangana: 9 ఏళ్ల తర్వాత హంతకుడిని పట్టించిన ఫేస్బుక్ ఫొటో!
- యువతిని ప్రేమించి రహస్యంగా పెళ్లాడిన నిందితుడు
- ఆపై తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్లి చేసుకున్న హన్మంతు
- మొదటి భార్యను హత్య చేసి బావిలో పడేసిన వైనం
- రెండో భార్య, పిల్లలతో ఉన్న ఫొటోను ఫేస్బుక్లో పెట్టి దొరికిపోయిన నిందితుడు
నేరస్తుడు ఎంత తెలివైన వాడైనా కటకటాలకు వెళ్లడం పక్కా అని మరోమారు రుజువైంది. ప్రేమించి పెళ్లి చేసుకుని ఇద్దరు బిడ్డల్ని కని, ఆ తర్వాత మరో పెళ్లి చేసుకుని, ప్రేమించిన భార్యను హతమార్చి ఎవరికీ అనుమానం రాకుండా కాపురం చేస్తున్న నిందితుడు ఎట్టకేలకు కటకటాల పాలయ్యాడు. ఏళ్లు గడిచిపోవడంతో తన పాపం సమాధి అయిపోతుందని భావించిన హంతకుడిని ఫేస్బుక్లో పెట్టిన ఫొటో పట్టించింది. నల్గొండ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
జిల్లాలోని మర్రిగూడ మండలం వెంకేపల్లికి చెందిన మోర హన్మంతు హైదరాబాద్లో కారు డ్రైవర్. ఎల్బీనగర్లో ఉంటున్న నార్కట్పల్లి మండలంలోని మాండ్రకు చెందిన ప్రియాంకను ప్రేమించి 2006లో రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. విషయం ఇరు కుటుంబాలకు తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. వీరికి కుమార్తె, కుమారుడు జన్మించారు.
హన్మంతు పెళ్లి విషయాన్ని రహస్యంగా ఉంచడంతో అతడి తల్లిదండ్రులు మరో సంబంధం చూసి 2007లో పెళ్లి చేశారు. దీంతో స్వగ్రామంలోనే కాపురం పెట్టిన ఆయన వ్యవసాయ పనుల్లో బిజీగా ఉన్నానని, అందుకే రాలేకపోతున్నానని హైదరాబాద్లో ఉంటున్న తొలి భార్యను నమ్మించాడు. ఆమె నుంచి ఒత్తిడి పెరుగుతుండడంతో వదిలించుకోవడానికి ప్రయత్నించాడు.
2009లో ఇంట్లో ఎవరూ లేని సమయంలో గ్రామానికి ఆమెను తీసుకొచ్చి ఇంట్లోనే చంపేశాడు. గ్రామ శివారులో ఉన్న బావిలో ఆమె మృతదేహాన్ని పడేసి చేతులు దులుపుకున్నాడు. అదే బావిలో గ్రామస్థులు జంతువుల కళేబరాలు, ఇతర చెత్తా చెదారం వేస్తుండంతో హత్య విషయం బయటకు రాలేదు.
హన్మంతును ప్రియాంక పెళ్లాడిన తర్వాత రెండో సారి గర్భం దాల్చిన సమయంలో ఆమె తమ్ముడు ఉపేందర్ ఓసారి హైదరాబాద్ వచ్చాడు. ఆ సమయంలో అనుకోకుండా సోదరి తారసపడడంతో ఇంటికి వెళ్లి నాలుగు రోజులు అక్కడే గడిపాడు. ఆ తర్వాత కొన్ని నెలలకు మరోమారు హైదరాబాద్ వచ్చిన ఉపేందర్ అక్కను ఇంటికి తీసుకెళ్లాలని భావించి ఆమె ఇంటికి వెళ్లాడు. అయితే, ఇంటికి తాళం వేసి ఉండడంతో వెనక్కి వెళ్లిపోయాడు. ఆ తర్వాతి నుంచి తన సోదరి కోసం గాలిస్తూనే ఉన్నాడు. అయినా ఫలితం లేకపోవడంతో 2009లో తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇటీవల హన్మంతు ఫేస్బుక్లో తన భార్య, పిల్లలతో ఉన్న ఫొటోను పోస్టు చేశాడు. దీనిని చూసిన ఉపేందర్ అతడు హన్మంతేనని గుర్తు పట్టాడు. తన సోదరి కాకుండా పక్కన మరో భార్య ఉండడంతో అనుమానించాడు. రెండు రోజుల క్రితం హైదరాబాద్ వచ్చి ఎల్బీనగర్ పోలీసులకు, ఆ తర్వాత మర్రిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు హన్మంతును అదుపులోకి తీసుకుని విచారించగా ప్రియాంక హత్య విషయం వెలుగుచూసింది. తానే చంపేసి ఆమెను బావిలో పడేసినట్టు అంగీకరించాడు. భార్యను చంపేసిన అనంతరం కుమారుడు, కుమార్తెను బంధువులకు అప్పగించాడని పోలీసులు తెలిపారు. అయితే, నిజంగానే వారికి అప్పగించాడా? లేక, ఎవరికైనా విక్రయించాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.