paruchuri gopalakrishna: నేను థియేటర్లో ఉండగానే ఓ కుర్రాడు అసహనంతో అరిచాడు: పరుచూరి గోపాలకృష్ణ
- 'కాయ్ రాజా కాయ్' సినిమాకి పనిచేశాము
- థియేటర్లో ఆ సినిమా చూస్తున్నాను
- కథకి లవ్ ట్రాక్ అడ్డుపడింది
సినీ రచయితగా పరుచూరి గోపాలకృష్ణకి ఎంతో అనుభవం వుంది. ఆయన కథలను .. సంభాషణలను అందించిన ఎన్నో చిత్రాలు ఘన విజయాలను అందుకున్నాయి. తాజాగా 'పరుచూరి పాఠాలు' కార్యక్రమం ద్వారా ఆయన 'అన్ వాంటెడ్ లెంగ్త్' సీన్స్ గురించి ప్రస్తావించారు. "సినిమాల్లో ఒక్కోసారి ప్రేమకథ అనేది అవసరమవుతుంది .. ఒక్కోసారి అడ్డు అవుతుంది. మేం డైరెక్ట్ చేసిన 'కాయ్ రాజా కాయ్' సినిమాలో ఒక అన్ వాంటెడ్ లెంగ్త్ సీన్ కథకి అడ్డుపడింది.
ఈ సినిమాలో మురళీ మోహన్ ను సుమలత ప్రేమిస్తుంటుంది. ఆమె తండ్రి అయిన రావు గోపాలరావు ఒక హత్య కేసులో మురళీమోహన్ ను జైలుకు పంపిస్తాడు. జైలుకు వెళ్లి మురళీమోహన్ తో తాళి కట్టించుకుని వస్తుంది సుమలత. జైల్లో వున్న తనభర్తకి రోజూ అన్నం తీసుకెళ్లి పెడతానని తండ్రితో అంటుంది. అయితే అతనికి యావజ్జీవ శిక్ష పడేలా చేస్తానని రావుగోపాలరావు అంటాడు. అలా చేస్తే రోజూ 'వెండి పళ్లెం'లో అన్నం తీసుకెళతానని చెబుతుంది.
అలా తండ్రీ కూతుళ్ల మధ్య పోటాపోటీగా వాదన జరుగుతూ ఉంటుంది .. ఇంట్రవెల్ కి ముందొచ్చే ఈ సీన్ కి ప్రేక్షకులు బల్లలు ఎక్కి చప్పట్లు కొట్టారు. ఇంట్రవెల్ తరువాత తండ్రీ కూతుళ్ల మధ్య ఏం జరుగుతుందో చూడాలనే మంచి ఊపుతో ఆడియన్స్ లోపలికి వచ్చారు. కానీ ఆ తరువాత 30 నిమిషాల సేపు చంద్రమోహన్ - తులసిల ప్రేమకథ చూపించాము. అన్ వాంటెడ్ లెంగ్త్ సీన్ కావడంతో .. 'వెండి పళ్లెం ఏమైందిరా' అంటూ నా వెనుక నుంచి ఒక కుర్రాడు అసహనంతో అరిచాడు. .. దాంతో నేను షాక్ అయ్యాను" అని చెప్పుకొచ్చారు.