ys bharathi: ఈ కేసు గురించి నాకేమీ తెలియదు!: 'వైయస్ భారతిపై ఈడీ కేసు'పై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ!
- కేసు గురించి నాకు ఏమీ తెలియదు
- స్థానిక సమస్యలపై పీపుల్స్ మేనిఫెస్టో తయారు చేస్తాం
- ఏపీకి ప్రత్యేకహోదా వస్తుందనే నమ్మకం ఉంది
వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసులో ఆయన భార్య భారతిపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అభియోగాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. భారతీ సిమెంట్స్ లో క్విడ్ ప్రోకో పద్ధతిలో పెట్టుబడుల వ్యవహారం జరిగిందనే కోణంలో ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.
ఈ నేపథ్యంలో జగన్ అక్రమాస్తుల కేసును గతంలో దర్యాప్తు చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణను... ఈ కేసుపై స్పందించాల్సిందిగా మీడియా కోరగా... ఈ కేసు గురించి తనకు ఏమీ తెలియదని చెప్పారు. ఈరోజు ఆయన విశాఖ జిల్లాలోని చోడవరంలో 'విద్యార్థులను తీర్చిదిద్దడం ఎలా?' అనే అంశంపై ఉపాధ్యాయులకు శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ఉన్నత శిఖరాలను చేరుకునే విధంగా విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకోవాలని చెప్పారు. రాష్ట్రంలోని 17 వేల గ్రామాల్లో ఉన్న స్థానిక సమస్యలపై పీపుల్స్ మేనిఫెస్టోను తయారు చేసి, రాజకీయ పార్టీలకు అందిస్తామని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందనే నమ్మకం తనకు ఉందని చెప్పారు.