Chandrababu: చంద్రబాబు బినామీ కంపెనీ ‘దివీస్’: వైఎస్ జగన్ ఆరోపణలు
- రైతులపై కేసులు బనాయిస్తున్నారు
- విశాఖలో ఫార్మా కంపెనీ వస్తే సంతోషించేవాళ్లం
- తుని నియోజకవర్గంలో ఇలాంటి కంపెనీలా?
చంద్రబాబు బినామీ కంపెనీ ‘దివీస్’ అని, ఈ కంపెనీకి భూములు ఇవ్వలేదని రైతులపై కేసులు బనాయిస్తున్నారని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా తునికి ఆయన పాదయాత్ర చేరుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ, విశాఖకు ఫార్మా కంపెనీ వచ్చి ఉంటే అందరమూ సంతోషించే వాళ్లమని, కానీ, అతిపెద్ద హాచరీస్ ఉన్న తుని నియోజకవర్గంలోని ప్రాంతంలో ఇలాంటి కంపెనీలా? అని ప్రశ్నించారు. పైగా కేంద్రం కూడా ఈ ప్రాంతాన్ని ఆక్వా జోన్ గా ప్రకటించిందని, ఇక్కడ ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేసి నీళ్లను కలుషితం చేసి ఆక్వాజోన్ కు ఆటంకాలు కలిగిస్తున్నారని మండిపడ్డారు. ఇదే తుని నియోజకవర్గంలో కాపు రిజర్వేషన్లకు తమ పార్టీ సంపూర్ణ మద్దతిచ్చిన విషయాన్ని జగన్ ప్రస్తావించారు. కాపు రిజర్వేషన్లకు తాము మద్దతు ప్రకటించిన కారణంగా వైసీపీ కార్యకర్తలను కేసుల్లో ఇరికించారని, నాడు తునిలో కుట్రపూరితంగా రైలును తగులబెట్టించిన వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. నాడు ఈ ఘటనకు సంబంధించి ఎస్సీలు, బీసీలు, మహిళలు, వికలాంగులపైనా కేసులు బనాయించారని, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వస్తే ఆ కేసులన్నింటినీ ఎత్తివేస్తామని జగన్ హామీ ఇచ్చారు.