Hyderabad: పది రోజుల నుంచి పోలీసులకు దొరక్కుండా ముప్పుతిప్పలు పెడుతున్న ఆర్కే మీడియా అధినేత!
- 2వ తేదీన జూబ్లీహిల్స్ లో హత్యాయత్నం
- ఆపై మధ్యాహ్నానికి స్టేషన్ కు వస్తానని నమ్మించిన రవికుమార్
- పోలీసు అధికారి, రాజకీయ నేత సాయంతో పారిపోయాడని అనుమానం
హైదరాబాద్, జూబ్లీహిల్స్ లో భార్యా భర్తలపై హత్యాయత్నం చేసి, ఆపై మధ్యాహ్నంలోగా పోలీసులకు పట్టుబడతానని నమ్మించి పరారైన ఆర్కే మీడియా అధినేత పనస రవికుమార్ ను అరెస్ట్ చేసేందుకు పది రోజుల నుంచి పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఇంకా ఫలించలేదు. 2వ తేదీ రాత్రి 2.30 గంటలకు డ్రైవర్ గా పనిచేస్తున్న రాజు, అతని భార్య వీరవేణిలపై రవికుమార్, మరో ఇద్దరు కత్తితో దాడికి దిగిన సంగతి తెలిసిందే.
ఆపై మధ్యాహ్నానికి స్టేషన్ కు వస్తానని చెప్పి, తర్వాత పరారయ్యాడు. తన ఫోన్ ను సైతం స్విచ్చాఫ్ చేశాడు. అతని కారు జాడను కూడా పోలీసులు పట్టుకోలేకపోయారు. రవికుమార్ పారిపోవడానికి ఓ పోలీసు అధికారితో పాటు మరో రాజకీయ నాయకుడు సాయం చేసినట్టు అనుమానాలు ఉన్నాయి. స్పెషల్ టీములు, టాస్క్ ఫోర్స్ తీవ్రంగా గాలిస్తున్నా రవికుమార్ దొరక్కుండా ముప్పుతిప్పలు పెడుతున్నాడు. కోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందాలన్నది రవికుమార్ ఆలోచనగా తెలుస్తోందని కొందరు పోలీసు అధికారులు భావిస్తున్నారు.