Kortezh: పుతిన్ కోసం సూపర్ బైక్.. తయారుచేసిన 'ఏకే-47' కంపెనీ!
- కొర్టెజ్ పేరుతో బైక్ డిజైన్ చేసిన కలష్నికోవ్ సంస్థ
- 3.5 సెకన్లలోనే 100 కి.మీ వేగం
- వచ్చే ఏడాది మార్కెట్ లోకి
ఏకే-47.. ఈ పేరు వినగానే బుల్లెట్ల వర్షం కురిపించే తుపాకీ కళ్ల ముందు కదలాడుతుంది. రష్యా కంపెనీ కలష్నికోవ్ తయారుచేస్తున్న ఈ తుపాకులను ప్రపంచవ్యాప్తంగా చాలాదేశాలు వాడుతున్నాయి. అయితే తాజాగా అదే కలష్నికోవ్ కంపెనీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కోసం ఓ సూపర్ బైక్ ను తయారుచేసింది.
కొర్టెజ్ పేరుతో తీసుకొచ్చిన ఈ బైక్ ను కొంచెం క్లాసిక్, ఇంకొంచెం మోడ్రన్ లుక్ తో కలష్నికోవ్ డిజైన్ చేసింది. దాదాపు 500 కిలోల బరువు, 150 హార్స్ పవర్ సామర్థ్యముండడంతో ఈ బైక్ ఇంజిన్ స్టార్ట్ చేసిన 3.5 సెకన్లలోనే గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. గరిష్టంగా గంటకు 113 కి.మీ వేగంతో దూసుకెళ్లే ఈ బైక్ ను పెట్రోల్ వేరియంట్ లో మాత్రమే ప్రస్తుతానికి తయారుచేశారు. ప్రస్తుతానికి ఈ బైక్ ప్రోటోటైప్ ను మాత్రమే కంపెనీ తయారుచేసింది.
రష్యా అధ్యక్షుడు పుతిన్ కు సూపర్ బైక్ లు అంటే చాలా ఇష్టం. తాజాగా కలష్నికోవ్ తయారుచేసి కొర్టెజ్ బైక్ ను పుతిన్ నడపకపోయినా ఆయన వాహనాలకు ఎస్కార్ట్ గా వాడనున్నారు. ఈ బైక్ ను వచ్చే ఏడాది మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది. త్వరలోనే ఈ బైక్ విక్రయాలను అమెరికాలోనూ ప్రారంభిస్తామని కంపెనీ వర్గాలు తెలిపాయి.