bjp: గో సంరక్షణ కోసం.. బీజేపీకి, ఎమ్మెల్యే పదవికి రాజాసింగ్ రాజీనామా!
- పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశా
- ఎన్నో ఏళ్లుగా గోసంరక్షణ ఉద్యమం చేస్తున్నా
- ఈ ఉద్యమానికి, పార్టీకి లింక్ పెట్టకూడదనే ఈ నిర్ణయం
టీ-బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియాతో రాజాసింగ్ మాట్లాడుతూ, నాలుగు రోజుల క్రితమే తన రాజీనామా లేఖను తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ కు ఇచ్చానని చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గోవధల సంఖ్య పెరిగిపోతోందని, ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు కూడా ఆవు మాంసాన్ని ఎగుమతి చేస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 22న బక్రీద్ పండగ ఉందని, గోవుల తరలింపును అడ్డుకునేందుకు ఒక్క చెక్ పోస్ట్ ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని అన్నారు. దొంగలతో సమావేశాలు పెడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం, గో సంరక్షణకు పాటుపడే వారితో సమావేశాలు నిర్వహించదా? అని మండిపడ్డారు.
మన తెలంగాణలో ఆవు రక్తం కింద పడితే రాష్ట్రం మంచిగా ఉంటుందా? సర్వనాశనం అవుతుందా? గతంలో చండీయాగం నిర్వహించిన సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని తెలుసుకోవాలని, ఆయనకు చెప్పేంతటి వాడిని కాదని అన్నారు. తెలంగాణ నుంచి ఆవులు, ఎద్దులు, దూడల మాంసం కర్ణాటక, ముంబయి లకు సరఫరా అవుతోందని అన్నారు. హైదరాబాద్ లోని పాతబస్తీలో ఆవులు, ఎద్దులు, దూడల మాంసాన్ని డంప్ చేసి పెట్టారని ఆరోపించారు.
‘గో సంరక్షణ కోసం ఏం చేసేందుకైనా మేం సిద్ధమే. ముందుగా, పార్టీకి నా వల్ల నష్టం కలగకూడదనే రాజీనామా చేశాను. నాలుగు రోజుల క్రితం రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ గారికి ఇచ్చాను. ఎన్నో సంవత్సరాల నుంచి గోసంరక్షణ ఉద్యమం చేస్తున్నా. నా ఉద్యమాన్ని పార్టీకి లింక్ పెట్టాలని కొందరు చూస్తున్నారు. అందుకే, నా ఉద్యమానికి, పార్టీకి సంబంధం లేదు. పార్టీకి నా వల్ల నష్టం జరగకూడదనే రాజీనామా చేశాను. ముఖ్యమంత్రి గారికి దండం పెడుతున్నా.. ఒక్క ఆవు గానీ, ఒక్క ఎద్దు గానీ, చిన్నచిన్న దూడలు గానీ వధకు గురికాకుండా చూడాలని కోరుకుంటున్నా. అలా చేస్తే, మీకు చాలా పుణ్యముంటుంది’ అని రాజాసింగ్ అన్నారు.