Amitabh Bachchan: అమితాబ్ 'జంజీర్' సినిమా చేయడానికి కారణం నేనే!: బాలీవుడ్ హీమ్యాన్ ధర్మేంద్ర
- డైరెక్టర్ ప్రకాశ్ తో గొడవతోనే వెనక్కి తగ్గా
- నేను బాగా చదవాలని నాన్న కోరుకునేవారు
- నాకేమో సినిమాలపై ప్రాణం ఉండేది
నాటి బాలీవుడ్ హీమ్యాన్ ధర్మేంద్ర, బిగ్ బి అమితాబ్ బచ్చన్ ల స్నేహం గురించి మనందరికీ తెలిసిందే. షోలే, చుప్కేచుప్కే, ఛోటీసీ బాత్ సహా పలు బ్లాక్ బస్టర్ చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. అయితే అమితాబ్ నటించిన మరో బ్లాక్ బస్టర్ చిత్రం జంజీర్ గురించి ధర్మేంద్ర ఓ ఆస్తకికరమైన విషయాన్ని వెల్లడించారు.
ఇండియా టీవీలో జరిగిన 'ఆప్ కీ అదాలత్' అనే కార్యక్రమంలో ధర్మేంద్ర మాట్లాడుతూ.. ‘జంజీర్ సినిమాలో హీరో పేరు విజయ్ ఖన్నా. ఈ చిత్రంలో నన్ను దృష్టిలో పెట్టుకునే కథను రాశారు. ఇందులో ముంతాజ్ నా సరసన నటించాలి. అయితే నా బంధువు ఒకరితో జంజీర్ దర్శకుడు ప్రకాశ్ మెహ్రా గొడవ పడ్డారు. దీంతో ఆ ప్రాజెక్ట్ నుంచి నేను తప్పుకోవాల్సి వచ్చింది’ అని తెలిపారు.
పంజాబ్ లోని స్కూల్ లో తన తండ్రి హెడ్ మాస్టర్ గా పనిచేసేవారని ధర్మేంద్ర తెలిపారు. ‘నేను బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేయాలని ఆయన కోరుకునేవారు. కానీ నాకేమో సినిమాల మీద ప్రాణం ఉండేది. దిలీప్ కుమార్ నటించిన షహీద్ నేను చూసిన తొలి సినిమా. దాన్ని చూశాక సినిమా రంగంపై ఇష్టం పెరిగిపోయింది’ అని ధర్మేంద్ర చెప్పారు. కాగా, ధర్మేంద్ర, ఆయన ఇద్దరు కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్, హీరోయిన్ కృతి కర్బంద నటించిన ‘యమ్లా పగ్లా దివానా ఫిర్ సే’ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 31న విడుదల కానుంది. ఈ సినిమాకు నవనీత్ సింగ్ దర్శకత్వం వహించారు.