osmania university: నాడు ఓయూ గేట్ల వద్ద మమ్మల్ని ఆపేసిన విషయాన్ని ‘కాంగ్రెస్’ మర్చిపోయింది!: మంత్రి హరీశ్ రావు దెప్పిపొడుపు
- రాహుల్ సభకు అనుమతిలేకపోతే విమర్శలా?
- జాతీయ పార్టీలు రెండూ చిన్నచూపు చూస్తున్నాయి
- తెలంగాణకు కూడా రాయితీలు ఇవ్వాలి
నాడు తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మానియా యూనివర్శిటీలోకి మమ్మల్ని అడుగుపెట్టనివ్వకుండానే గేట్ల వద్దే ఆపివేశారని కాంగ్రెస్ నేతలపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు విమర్శలు చేశారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ నుంచి ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉస్మానియా యూనివర్శిటీలో రాహుల్ గాంధీ సభకు అనుమతివ్వలేదంటూ తమ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయడం తగదని అన్నారు. ఈ సభకు ఓయూ వీసీ అనుమతివ్వకుంటే మాకేమి సంబంధం? అని ప్రశ్నించారు. నాడు తెలంగాణ కోసం విద్యార్థులు ఉద్యమం చేసినప్పుడు ఒక్కసారైనా కాంగ్రెస్ నేతలు వర్శిటీకి వచ్చారా? అని ప్రశ్నించారు.
విద్యార్థులపై కాంగ్రెస్ పార్టీది కపట ప్రేమ అని, ఉద్యమ సమయంలో విద్యార్థులు బలవుతుంటే కాంగ్రెస్ నేతలు పరామర్శించారా? ‘చంపేది మీరే, కాల్చేది మీరే, పరామర్శించేది మీరే’నంటూ కాంగ్రెస్ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. విభజన చట్టంలో రాష్ట్రానికి చెందిన ఏ ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా కల్పించారా? బీజేపీ, కాంగ్రెస్ కలిసి ఏడు మండలాలను ఏపీలో కలిపాయని విమర్శించారు. విభజన చట్టంలో చెప్పినట్టు ఏపీకి ఇచ్చే రాయితీలు తెలంగాణకు కూడా ఇవ్వాలని, దీనిపై రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. జాతీయ పార్టీలు రెండూ తెలంగాణను చిన్నచూపు చూస్తున్నాయని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామరక్ష అని, ప్రతీ ఎన్నికలలో టీఆర్ఎస్ సత్తా చూపించిందని అన్నారు.