Andhra Pradesh: నూజివీడు ట్రిపుల్ ఐటీలో జోరుగా మత ప్రార్థనలు.. పుష్కలంగా అధికారుల సాయం!
- తల్లిదండ్రుల ముసుగులో క్యాంపస్‌లోకి మత ప్రచారకులు
- అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరుగా బోధనలు
- మతం మారాలంటూ విద్యార్థులకు ప్రలోభాలు
నూజివీడు ట్రిపుల్ ఐటీ మత ప్రార్థనలకు నిలయంగా మారుతోంది. ప్రతీ ఆదివారం ఓ మతానికి చెందినవారు ఇక్కడ జోరుగా ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రుల ముసుగులో క్యాంపస్‌లోకి ప్రవేశిస్తున్న మత బోధకులు ప్రార్థనలు చేస్తూ విద్యార్థులను మతం మార్చే ప్రయత్నం చేస్తున్నారు. క్యాంపస్‌లోని పోస్టాఫీసు వద్ద బాలికలకు, హాస్టల్ గదుల్లో అబ్బాయిలకు ప్రార్థనలు నిర్వహిస్తున్నారు.
ఈ మొత్తం వ్యవహారంలో ట్రిపుల్ ఐటీ అధికారులు, అధ్యాపకుల పాత్ర కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మెకానికల్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఒకరు, ఆంగ్ల అధ్యాపకురాలు ఒకరు మత బోధకులకు తమవంతు సాయం అందిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ట్రిపుల్ ఐటీకే చెందిన ఓ అత్యున్నత అధికారి భార్య ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది.
విద్యార్థులను వివిధ రకాలుగా ప్రలోభ పెడుతూ మతం మార్చుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ మతంలోకి వస్తే మంచి మార్కులు వస్తాయని ప్రలోభాలకు గురిచేస్తున్నట్టు విద్యార్థులు చెబుతున్నారు. ట్రిపుల్ ఐటీలో ప్రార్థనలు జరుగుతున్న విషయం రెండేళ్ల క్రితమే వెలుగులోకి వచ్చింది. దీంతో స్పందించిన డైరెక్టర్ వీవీ దాసు ఇకపై ఇటువంటివి జరగడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ వాటిని బేఖాతరు చేస్తూ ప్రార్థనలు నిర్వహిస్తున్నారు.