Congress: నేడు తెలంగాణకు రాహుల్.. రెండు రోజులపాటు ఊపిరి సలపని కార్యక్రమాలు!
- మధ్యాహ్నం 2:30 గంటలకు హైదరాబాద్ రాక
- సభలు, సమావేశాలతో బిజీబిజీ
- ఘన స్వాగతం పలికేందుకు నేతలు సిద్ధం
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణలో రెండు రోజల పర్యటన కోసం నేడు హైదరాబాద్ చేరుకోనున్నారు. ఆయన పర్యటనకు సంబంధించిన షెడ్యూలును తెలంగాణ పీసీసీ రెడీ చేసింది. నేటి ఉదయం బీదర్‌లో జరగనున్న సభలో పాల్గొన్న అనంతరం ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 2:30 గంటలకు నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. కాంగ్రెస్ తెలంగాణ చీఫ్ ఉత్తమ్ కుమార్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ కుంతియా, సీఎల్పీ నేత జానారెడ్డి, ముఖ్య నేతలు ఆయనకు స్వాగతం పలుకుతారు.
విమానాశ్రయం నుంచి రాహుల్ ప్రత్యేక బస్సులో శంషాబాద్‌లోని క్లాసిక్ కన్వెన్షన్ హాల్‌కు చేరుకుంటారు. అక్కడ ఐదు వేల మంది మహిళా సంఘాల ప్రతినిధులతో ఆయన సమావేశం అవుతారు. అనంతరం శేరిలింగంపల్లిలో ఏర్పాటు చేసిన సభకు చేరుకుని ప్రసంగిస్తారు. ఈ సభకు 25 వేల మందిని సమీకరించాలని కాంగ్రెస్ యోచిస్తోంది. సభ అనంతరం బేగంపేటలోని హరిత ప్లాజా హోటల్‌కు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.
రెండో రోజు మంగళవారం ఉదయం 31 వేల మంది బూత్ కమిటీల అధ్యక్షులతో రాహుల్ ‘చార్మ్స్’ వ్యవస్థ ద్వారా నేరుగా మాట్లాడతారు. ఆ తర్వాత పార్టీ సీనియర్ నేతలతో సమావేశం అవుతారు. హరిత ప్లాజా హోటల్లో ఉదయం 10:30 నుంచి గంటపాటు పత్రికా సంపాదకులతో జరగనున్న ‘ముఖాముఖి’కి హాజరవుతారు. అనంతరం 12 గంటలకు హోటల్ తాజ్‌కృష్ణకు చేరుకుని యువ పారిశ్రామిక వేత్తలతో సమావేశం అవుతారు. మధ్యాహ్నం 3:45 గంటలకు గన్‌పార్క్ చేరుకుని అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పిస్తారు. సాయంత్రం 4:45 గంటలకు సరూర్ నగర్‌లోని విద్యార్థి నిరుద్యోగ గర్జన సభలో ప్రసంగిస్తారు. అనంతరం రాత్రి 7:30 గంటలకు తిరిగి ఢిల్లీ బయలుదేరుతారు.