Geetika: ఆత్మహత్య చేసుకునేంత పిరికిదాన్ని కాను... కానీ చేసుకునేలా చేశారు: తిరుపతి మెడికో గీతిక సూసైడ్ లెటర్
- వేధింపులను భరించే ఓపిక ఇక లేదు
- తల్లిదండ్రులను క్షమించాలని వేడుకున్న గీతిక
- సమగ్ర విచారణ జరిపిస్తామన్న కలెక్టర్ ప్రద్యుమ్న
ఉన్నతాధికారులు, మార్కులేయాల్సిన ప్రొఫెసర్లు మరో మెడికో ప్రాణాలు కోల్పోయేందుకు కారణం అయ్యారు. తాను ఎదుర్కొంటున్న వేధింపులను ఇంకా భరించే ఓపిక లేదని భావించిన తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాల విద్యార్థిని గీతిక ఆత్మహత్య చేసుకోగా, ఆమె రాసిన సూసైడ్ లెటర్ ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ఆ లేఖను పోలీసులు మీడియాకు విడుదల చేశారు. తన తల్లిదండ్రులను క్షమించమని ఈ లేఖలో వేడుకున్న గీతిక, తానేమీ ఆత్మహత్య చేసుకునేంత పిరికిదాన్ని కాదని, కానీ ఆత్మహత్య చేసుకునేలా చేశారని రాసింది.
కాగా, గీతిక ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపించాలని, ఆమెను వేధించిన వారిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వరుసగా మెడికోలు బలవన్మరణాలకు పాల్పడుతున్నా, ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోందన్న విమర్శలు పెరుగుతున్నాయి. గీతిక ఆత్మహత్య గురించిన వివరాలను నిన్న కళాశాల అధికారులతో మాట్లాడి తెలుసుకున్న కలెక్టర్ ప్రద్యుమ్న, పూర్తి విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో గీతిక ఆత్మహత్య వెనుక ఒత్తిళ్లు, వేధింపులు ఏమీ లేవని, ఆమె కుటుంబ సమస్యల కారణంగానే సూసైడ్ చేసుకుందని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో గీతిక రాసిన ఆత్మహత్యా లేఖ వెలుగులోకి రావడం గమనార్హం.