vvpat: వీవీపాట్ యంత్రాల్లో స్వల్ప మార్పులు చేసేందుకు సిద్ధమైన ఎలక్షన్ కమిషన్
- వీవీపాట్ యంత్రాల్లో లోపాల నివారణకు చర్యలు
- సెన్సార్ ఉన్న ప్రదేశంలో కవచం ఏర్పాటు
- పేపర్‌ను కూడా మార్చనున్నట్టు అధికారుల వెల్లడి
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)లకు అనుసంధానంగా ఉన్న వోటర్ వెరిఫియబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీపాట్) యంత్రాల్లో స్వల్ప మార్పులు చేసేందుకు ఎన్నికల సంఘం సిద్దమైంది. ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత తన ఓటు సరిగా పడిందీ, లేనిదీ తెలుసుకునేందుకు వీవీపాట్ యంత్రం నుంచి ఓ చీటీ వస్తుంది. ఈవీఎంలు సరిగా పనిచేయడం లేదన్న ఆరోపణల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ వీటిని అందుబాటులోకి తీసుకొచ్చింది.
వీవీపాట్ యంత్రాలు కూడా సరిగా పనిచేయడం లేదన్న ఆరోపణలు రావడంతో స్పందించిన ఎన్నికల సంఘం ఈ మార్పులు చేస్తోంది. ఈ ఏడాది మే 28న 10 రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో వినియోగించిన 10,300 వీపీపాట్లలో 11 శాతం యంత్రాలు ఇబ్బంది పెట్టాయి. దీంతో వీటిని అప్పటికప్పుడు మార్చాల్సి వచ్చింది.
మరోసారి ఇటువంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ కొన్ని సూచనలు చేసినట్టు ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ తెలిపారు. యంత్రాలను కాంతిపడే ప్రదేశంలో పెట్టినప్పుడు కాంట్రాస్ట్ సెన్సార్ సరిగా పనిచేయడం లేదని తెలిపారు. దీంతో కాంతి నేరుగా దీనిపై పడినప్పటికీ చీటీ ప్రింటెడ్ స్లిప్ (ముద్రిత చీటీ) వచ్చేందుకు వీలుగా సెన్సార్‌పై ఓ కవచం లాంటిది ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. వీవీపాట్ యంత్రాల్లో ఉపయోగించే కాగితం తేమను పీల్చుకోవడం వల్ల ప్రింటింగ్‌లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కాబట్టి ఇకపై తేమను పీల్చుకోని కాగితాన్ని వాడాలని నిర్ణయించినట్టు రావత్ తెలిపారు.