Tirumala: తిరుమలలో మొదలైన అష్టబంధన లేపన తయారీ... ఎలా చేస్తున్నారో తెలుసుకోండి!
- ఎనిమిది రకాల ద్రవ్యాలతో లేపనం
- లేపన జీవితకాలం పుష్కరం
- ఎనిమిది దిక్కుల్లో సమర్పించనున్న రుత్విక్కులు
పుష్కరానికోమారు వైష్ణవ ఆలయాల్లో జరిగే అష్టబంధన బాలాలయ మహా సంప్రోక్షణ కార్యక్రమం తిరుమలలో కీలక దశకు చేరుకుంది. గర్భగుడిలోని మూల విరాట్టుకు సమర్పించే అష్టబంధన లేపనం తయారీని రుత్విక్కులు ఈ ఉదయం ప్రారంభించారు. ఎనిమిది దిక్కులకు సూచికలుగా ఎనిమిది రకాల ద్రవ్యాలను కలిపి దీన్ని తయారు చేస్తున్నారు. ఇది ఆరిన తరువాత అత్యంత గట్టిగా మారుతుంది. దీని కాఠిన్యం పుష్కరకాలం ఉంటుంది. అందుకే 12 సంవత్సరాలకు ఒకసారి దీన్ని మూలవిరాట్టుకు సమర్పిస్తారు.
పవిత్ర ద్రవ్యాలైన శంఖ చూర్ణం, మధూచ్ఛిష్టం (తేనెపట్టు మైనం), లాక్ష, త్రిఫలం, కాసీనం, గుగ్గిలం, చూర్ణం, రక్తశిలలను తొలుత సమభాగాలుగా చేస్తారు. ఆపై ఈ మిశ్రమాన్ని వెన్నతో కలిపి, గోరువెచ్చని నీటితో కలుపుతారు. ఈ మిశ్రమాన్ని మూలవిరాట్టు నిలబడి ఉండే పద్మపీఠం వద్ద ఎనిమిది దిక్కులలో వేస్తే ఈ క్రతువు పూర్తవుతుంది.
చంద్రుడికి సూచికగా శంఖ చూర్ణం, రోహిణికి సూచికగా మధూచ్ఛిష్టం, స్కందుడికి సూచికగా చూర్ణం, అగ్నికి సూచికగా లాక్ష, చండదీధితికి సూచికగా గుగ్గిలం, హరికి సూచికగా త్రిఫలం, వాయువుకు సూచికగా కాసీనం, పృధ్వికి సూచికగా రక్తశిలను వాడతారు. అష్టబంధనం సమర్పించిన తరువాత ఆనంద నిలయం మరింత తేజోవంతమై, మరో 12 సంవత్సరాల పాటు ఆలయం చెక్కు చెదరకుండా ఉంటుందని విశ్వాసం.