Venkatagiri: వెంకటగిరి సంస్థానపు చివరి పట్టపు రాణి శారదాదేవి కన్నుమూత!
- ఆమె వయసు 91 సంవత్సరాలు
- అనారోగ్య సమస్యలతో మరణం
- సంతాపం తెలిపిన పలువురు
వెంకటగిరి సంస్థానపు చివరి పట్టపు రాణి శారదాదేవి ఈ ఉదయం కన్నుమూశారు. ఆమె వయసు 91 సంవత్సరాలు. వృద్ధాప్యం కారణంగా వచ్చిన అనారోగ్య సమస్యలే ఆమె మృతికి కారణమని కుటుంబసభ్యులు వెల్లడించారు. వెంకటగిరి సంస్థానం చివరి రాజు వీవీఆర్కే యాచేంద్ర సతీమణి శారదాదేవి. ఆమె అంత్యక్రియలు నేడు వెంకటగిరిలో జరగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లోని సంస్థానాల్లో వెంకటగిరి సంస్థానం ఒకటన్న సంగతి తెలిసిందే. నెల్లూరు ప్రాంతంలోని ఈ సంస్థానాన్ని భారత స్వాతంత్ర్యం వరకూ, సుమారు 350 సంవత్సరాలకు పైగా అర్థ స్వతంత్ర పరిపాలకులైన వెలుగోటి వంశస్థులు పాలించారు. పెద్దరాయలు గజపతుల సామంతులుగా వీరు ప్రజలకు సుపరిపాలన అందించి, ఆపై 1750 నుంచి ఆర్కాటు నవాబుకు సామంతులుగా వ్యవహరించారు. 1802 నుంచి 1947 వరకూ బ్రిటీష్ వారి కింద సంస్థానాధీశులుగా, ఆపై స్వతంత్ర భారతావనిలో భాగంగా మారారు. అందువల్ల శారదాదేవి సంస్థానం చివరి పట్టపు రాణిగా మిగిలారు. శారదాదేవి మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు సంతాపం తెలిపారు.