gavaskar: గవాస్కర్ కు కౌంటర్ ఇచ్చిన ఇంగ్లండ్ కోచ్
- ఏ జట్టయినా పరిస్థితులను బట్టే పోరుకు సిద్ధమవుతుంది
- వార్మప్ మ్యాచ్ లు ఉండాలని అందరూ కోరుకుంటారు
- కానీ ఓటమికి దాన్ని కారణంగా చూపడం సరికాదు
ఇంగ్లండ్ గడ్డపై జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో టీమిండియా ఇప్పటికే చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. దీంతో, జట్టుపై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో, భారత ఆటగాళ్లను కొంచెం వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు క్రికెట్ దిగ్గజం గవాస్కర్. వరుసగా రెండు టెస్టుల్లో వైఫల్యం చెందడానికి పెద్దగా ప్రాక్టీస్ లభించకపోవడం కూడా ఒక కారణమని ఆయన అన్నారు.
ఈ వ్యాఖ్యలకు ఇంగ్లండ్ కోచ్ ట్రావెర్ బేలిస్ కౌంటర్ ఇచ్చాడు. భారత జట్టుకు పెద్దగా ప్రాక్టీస్ దొరకలేదనే విషయాన్ని ఓ వైపు అంగీకరిస్తూనే, ఉన్న పరిస్థితులను బట్టే ఏ జట్టయినా పోరుకు సిద్ధమవుతుందని అన్నాడు. ఏ సిరీస్ లో అయినా ప్రాక్టీస్ మ్యాచ్ లను ఇరికించడం అంత ఈజీ కాదని చెప్పాడు.
ప్రతి జట్టు వార్మప్ మ్యాచ్ లను కోరుకోవడం సాధారణ విషయమేనని, అయితే ఎక్కువ వార్మప్ మ్యాచ్ లను షెడ్యూల్ లో చేర్చడం సాధ్యంకాని పనని బేలిస్ చెప్పాడు. ఎక్కువ ప్రాక్టీస్ మ్యాచ్ లు లేవంటూ సాకులు చెప్పడం బాగోదని ఎద్దేవా చేశాడు. భారత్ లో పర్యటించేటప్పుడు ఎక్కువ ప్రాక్టీస్ మ్యాచ్ లు ఉండాలని తమకు కూడా అనిపిస్తుంటుందని... కానీ, ఓడిపోయినప్పుడు తాము ఈ అంశాన్ని కారణంగా చూపమని చెప్పాడు. టెస్ట్ సిరీస్ కు ముందు ఎసెక్స్ జట్టుతో టీమిండియా మూడు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడింది. వాస్తవానికి ఆ మ్యాచ్ నాలుగు రోజులు జరగాల్సి ఉన్నప్పటికీ, కొన్ని కారణాల వల్ల దాన్ని మూడు రోజులకు కుదించారు. దీనిపై గవాస్కర్ విమర్శించిన నేపథ్యంలో, బేలిస్ కౌంటర్ ఇచ్చాడు.