Tamilnadu: తూత్తుకుడి పోలీస్ కాల్పులపై సీబీఐ విచారణ.. ఆదేశించిన మద్రాస్ హైకోర్టు!
- పోలీసుల కాల్పుల్లో 13 మంది మృతి
- వేదాంత సంస్థకు హైకోర్టు నోటీసులు
- ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తున్న తూత్తుకుడి వాసులు
తమిళనాడులోని తూత్తుకుడిలో స్టెరిలైట్ కాపర్ ప్లాంట్ కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ప్రజలపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై మద్రాస్ హైకోర్టుకు చెందిన మధురై బెంచ్ సీబీఐ విచారణకు ఆదేశించింది.
ఈ మేరకు విజయ నివాస్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిల్ ను విచారించిన జస్టిస్ బషీర్ అహ్మద్, జస్టిస్ సీటీ సెల్వమ్ ల ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. అలాగే ఈ ప్లాంట్ కారణంగా అనారోగ్యానికి గురైన ప్రజలతో పాటు పోలీస్ కాల్పుల్లో చనిపోయినవారికి నష్టపరిహారంగా రూ.750 కోట్లు చెల్లించాలని దాఖలైన పిటిషన్ పై వేదాంత సంస్థకు కోర్టు నోటీసులు పంపింది.
ఈ ఏడాది మే 23న వేదాంత స్టెరిలైట్ కాపర్ ప్లాంట్ కు వ్యతిరేకంగా తూత్తుకుడి ప్రజలు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కొందరు ఆస్తుల విధ్వంసానికి దిగడంతో పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై అన్నివైపుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ఫ్యాక్టరీని శాశ్వతంగా మూసేయాలని తమిళనాడు ప్రభుత్వం ఆదేశించింది.