YSRCP: వైసీపీ వేసే ప్రతీ అడుగుకు ఆ మాటలే స్ఫూర్తి.. జగన్ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
- నెహ్రూ ప్రసంగం ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’ని గుర్తు చేసిన జగన్
- తాము వేసే ప్రతి అడుగుకు మహాత్ముడి ఆకాంక్షలే మార్గదర్శకాలన్న జగన్
- నేడు పాదయాత్రకు విరామం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తెలుగు రాష్ట్రాల ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ ఆకాంక్షలను గుర్తు చేసుకున్నారు. దేశానికి సేవ చేయడమంటే దేశంలోని కోట్లాదిమందికి సేవ చేయడమేనన్నది మహాత్ముడి ఆకాంక్ష అని పేర్కొన్నారు. పేదరికాన్ని, అజ్ఞానాన్ని, వ్యాధులను, అవకాశాల్లో అసమానతలను రూపుమాపకుండా దేశానికి సేవ చేశామనడంలో అర్థం లేదన్న మహాత్ముడి వ్యాఖ్యలను 15 ఆగస్టు 1947న నాటి ప్రధాని నెహ్రూ తన ప్రసంగం ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’లో పేర్కొన్నారు. జగన్ దీనిని గుర్తు చేస్తూ తమ పార్టీ వేస్తున్న ప్రతీ అడుగుకూ ఇవే మార్గదర్శకాలని పేర్కొన్నారు.
వైఎస్సార్ పాలనకు, ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలకు, ఆ తర్వాత ఆవిర్భవించిన వైసీపీకి కూడా నాటి మహాత్ముడి ఆకాంక్షలే మార్గదర్శకంగా నిలుస్తున్నాయని జగన్ పేర్కొన్నారు. కాగా, నేడు జగన్ తన పాదయాత్రకు విరామం ప్రకటించారు. విశాఖ జిల్లా వాసులు స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకునేందుకు వీలుగా బుధవారం పాదయాత్రకు విరామం ప్రకటించినట్టు వైసీపీ పేర్కొంది.