Telangana: వరంగల్ కలెక్టర్ ఆమ్రపాలి ఇంట్లో దెయ్యం.. స్వయంగా చెప్పిన కలెక్టర్!
- కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి పునాది రాయి వేసి 133 ఏళ్లు
- ఇంజినీర్ జార్జ్ పామర్ భార్య శంకుస్థాపన
- మొదటి అంతస్తులో దెయ్యం
- ఆమ్రపాలి చెప్పింది ఇదీ..
దెయ్యాలు ఉన్నాయా? ఈ విషయంలో ఒక్కొక్కరి నమ్మకాలు ఒక్కోలా ఉంటాయి. ఎవరి సంగతి ఎలా ఉన్నా వరంగల్ కలెక్టర్ ఆమ్రపాలి ఇంట్లో మాత్రం దెయ్యం ఉందట. అదంటే ఆమెకు భయమట కూడా. అందుకే ఆ ఇంట్లో పడుకోవడానికి సాహసించడం లేదంటూ ఆమె చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆమె అలా ఎందుకన్నారంటే..
వరంగల్ కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి పునాది రాయి వేసి ఆగస్టు 10తో 133 ఏళ్లు నిండింది. ఈ సందర్భంగా తాను నివాసం ఉంటున్న చారిత్రక భవనం గురించి ఆమ్రపాలి మాట్లాడుతూ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. అప్పట్లో ఈ భవనానికి జార్జ్ పామర్ భార్య శంకుస్థాపన చేశారని తెలిసిందన్నారు. దీంతో ఇంతకీ జార్జ్ పామర్ ఎవరో తెలుసుకోవాలన్న ఆసక్తి తనలో కలిగిందన్నారు. దీంతో పరిశోధన చేయగా జార్జ్ పామర్ గొప్ప ఇంజినీర్ అని తెలిసిందన్నారు. అతడి భార్యే ఈ భవనానికి శంకుస్థాపన చేశారన్నారు.
గతంలో ఈ భవనంలో పనిచేసిన కలెక్టర్లు ఇందులోని మొదటి అంతస్తులో దెయ్యం ఉందని తనతో చెప్పారని ఆమ్రపాలి పేర్కొన్నారు. తాను కలెక్టర్గా బాధ్యతలు చేపట్టాక ఓ రోజు మొదటి అంతస్తులోకి వెళ్లి చూస్తే.. గదంతా చిందరవందరగా ఉందని, దీంతో అన్నీ నీట్గా సర్దిపెట్టించానని పేర్కొన్నారు. అయినా సరే అక్కడ దెయ్యం ఉందన్న భయం తనను వీడలేదని, అందుకే అక్కడ నిద్రపోవడానికి సాహసించడం లేదని ఆమె నవ్వుతూ పేర్కొన్నారు.