kodela: అసెంబ్లీ ఉద్యోగులందరికీ త్వరలో పదోన్నతులు కల్పిస్తాం: ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల
- హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చడం లేదు
- కేంద్రం సహకరించకపోయినా అభివృద్ధిపథంలో పయనిస్తున్నాం
- పోలవరం ప్రాజెక్టు ఇంజనీరింగ్ మిరాకిల్
కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఈరోజు విలేకరుల సమావేశంలో తెలిపారు. దురదృష్టవశాత్తు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చడం లేదన్నారు. అయినా, రాష్ట్ర ప్రభుత్వం పోరాడి తన హక్కులను సాధించుకుంటుందన్నారు. రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు.
రాష్ట్రంలో అనేక సమస్యలు, కష్టాలు ఉన్నప్పటికీ అభివృద్ధి పథంలో పయనిస్తున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టు ఇంజనీరింగ్ మిరాకిల్ అని కొనియాడారు. పోలవరం కార్యరూపం దాలిస్తే, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. రాష్ట్రంలో చట్ట సభల పవిత్రతను కాపాడుతున్నామన్నారు. అసెంబ్లీ ఉద్యోగులందరికీ త్వరలో పదోన్నతులు కల్పిస్తామన్నారు. ఖాళీగా ఉన్న ఉన్నతస్థాయి పోస్టులను భర్తీ చేస్తామన్నారు. రాష్ట్రాభివృద్ధిలో అసెంబ్లీ ఉద్యోగుల పాత్ర మరువలేనిదన్నారు.