rapur: రాపూరు దళితులపై కేసులు భేషరతుగా ఎత్తివేయాలి: పవన్ కల్యాణ్
- ‘జనసేన’ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం
- ఏపీలో శాంతి భద్రతల నిర్వహణ సక్రమంగా లేదు
- కేసులు ఎత్తి వేస్తేనే సమస్య పరిష్కారమవుతుంది
నెల్లూరు జిల్లా రాపూరులో దళితులు - పోలీసుల మధ్య చోటుచేసుకున్న వివాదంపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (ప్యాక్) ఈరోజు చర్చించింది. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ప్రజా ప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో పనిచేస్తున్న ఒకరిద్దరు అధికారులను తమ గుప్పిట్లో పెట్టుకొని, లా అండ్ ఆర్డర్ ను తమ చేతుల్లోకి తీసుకోవడం వల్ల ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో తరచూ జరుగుతున్నాయని, రాపూరు ఘటనలో- ఒక దళిత కులస్తుల్లోని రెండు కుటుంబాల మధ్య జరిగిన సివిల్ వివాదంలో పోలీసుల జోక్యం వల్లనే ఈ ఘటన జఠిలమైందని కమిటీ అభిప్రాయపడింది.
దళిత తేజం పేరుతో ప్రభుత్వం ఓ పక్క ఆర్భాటం చేస్తుండగా, మరో పక్క ప్రజా ప్రతినిధులు దళితుల్ని అణచి వేసేలా వ్యవహరించడాన్ని సమావేశం గర్హించింది. రాపూరు సంఘటనలో ప్రభుత్వ వైఫల్యమే కారణమని సమావేశం భావించింది. సులభంగా పరిష్కారం కావల్సిన ఒక చిన్న వివాదం పోలీస్ స్టేషన్ పై దాడి వరకూ వెళ్లడం వెనక... సంవత్సరాలుగా గూడుకట్టుకున్న ఆవేదన, అణగారిన వర్గాలపై ప్రభుత్వం చూపిస్తున్న చిన్న చూపు, పోలీసుల దెబ్బలకు దళిత మహిళ చనిపోయిందనే ప్రచారం, దళితుల్లో తీవ్ర ఆగ్రహావేశాల్ని రగిలించిందని సమావేశం నిర్ధారణకు వచ్చింది. పోలీసులపై రాజకీయ నాయకుల ఒత్తిళ్ల మూలంగానే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం, పోలీసులు నిబంధనల మేరకు వ్యవహరించేలా సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉండటంపై ఈ సమావేశంలో చర్చించారు. రాపూరు దళితులపై అనేక సెక్షన్ల కింద కేసులు పెట్టి అరెస్టులు చేయడాన్ని సమావేశం ఖండించింది. కేసులుపెట్టి మానసికంగా హింసించడం సరైన పధ్ధతి కాదని, ఇలాంటి పద్ధతుల్ని మానుకోవాలని ప్యాక్ డిమాండ్ చేసింది.
ఇలాంటి సంఘటనలు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతల నిర్వహణ సక్రమంగా లేదనే విషయం వెల్లడవుతోందని సమావేశం అభిప్రాయపడింది. ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదని, రాపూరు దళితుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపి వారికి తగిన విధంగా న్యాయం చేయవలసిన భాధ్యత ప్రభుత్వానిదే అని సమావేశం డిమాండ్ చేసింది. రాపూరు ఘటనలో దళితులపై నమోదు చేసిన అన్ని కేసుల్నీ బేషరతుగా ఎత్తివేయాలని పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేసులు ఎత్తి వేస్తేనే సమస్య శాంతియుతంగా పరిష్కారమవుతుందని సూచించారు.