Hyderabad: ఎమ్మెల్సీ కొడుకునంటూ మద్యం మత్తులో అటవీ అధికారిపై దాడి.. ఐదుగురి అరెస్ట్
- కర్నూలు జిల్లా సున్నిపెంటలో ఘటన
- అటవీశాఖ కార్యాలయం సమీపంలో మందు తాగుతున్న యువకులు
- వద్దని వారించినందుకు సెక్షన్ ఆఫీసర్‌పై దాడి
అటవీశాఖ అధికారిపై మందుబాబులు రెచ్చిపోయారు. కార్యాలయం సమీపంలో మద్యం ఎందుకు తాగుతున్నారని ప్రశ్నించినందుకు అతడిపై దాడి చేశారు. ఎమ్మెల్సీ కొడుకునే అడ్డుకుంటావా? అంటూ దౌర్జన్యానికి దిగారు. కర్నూలు జిల్లా సున్నిపెంటలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
హైదరాబాద్‌కు చెందిన ఆరుగురు యువకులు కర్నూలు జిల్లా సున్నిపెంట వెళ్లారు. అక్కడ అటవీశాఖ కార్యాలయం సమీపంలో అందరూ కలిసి మద్యం తాగుతుండగా సెక్షన్ అధికారి జ్యోతి స్వరూప్ వారిని అడ్డుకున్నారు. అక్కడ మద్యం తాగొద్దని వారించారు. దీంతో యువకులు ఒక్కసారిగా అతడిపై దాడికి తెగబడ్డారు. ఎమ్మెల్సీ కొడుకునే అడ్డుకుంటావా? అంటూ దాడి చేశారు. తమ కాళ్లు పట్టుకుంటేనే ఇక్కడి నుంచి బయటపడతావంటూ హెచ్చరించారు. మందుబాబుల వీరంగంపై సమాచారం అందుకున్న పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో యువకుడు పరారీలో ఉన్నాడు. సెక్షన్ ఆఫీసర్‌ను బెదిరించిన వ్యక్తి ఎమ్మెల్సీ కొడుకు కాదని పోలీసులు తేల్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.