Lok Sabha: 4 రాష్ట్రాలు, లోక్ సభకు అయితేనే సిద్ధం... కుండబద్దలు కొట్టిన ఈసీ
- డిసెంబర్ లో ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం ఎన్నికలు
- పోలింగ్ యంత్ర సామాగ్రి నవంబర్ చివరకు సిద్ధం
- చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓపీ రావత్
లోక్ సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు మాత్రమే నిర్వహించగలమని ఎన్నికల కమిషన్ కుండబద్దలు కొట్టింది. లోక్ సభకు ముందస్తు ఎన్నికలు జరగవచ్చన్న వార్తల నేపథ్యంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓపీ రావత్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. డిసెంబర్ లో ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సివుండగా, వాటితో పాటు లోక్ సభకు ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన పోలింగ్ యంత్ర సామాగ్రి తమ వద్ద ఉంటాయని ఆయన అన్నారు.
సెప్టెంబర్ చివరికి ఈవీఎంలు, నవంబర్ చివరికి వీవీప్యాట్ లు తమకు అందుతాయని అన్నారు. కాగా, డిసెంబర్ 15న మిజోరం, జనవరి 5న ఛత్తీస్ గఢ్, జనవరి 7న మధ్యప్రదేశ్, జనవరి 20న రాజస్థాన్ అసెంబ్లీల కాలపరిమితి ముగియనుంది. కాగా, ఒకేసారి ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ సిద్ధమా? అని తమను ఎవరూ ఇప్పటివరకూ అడగలేదని, అందుకు సంబంధించిన మార్గాన్ని సూచించాలని మాత్రమే తమకు చెప్పారని ఎలక్షన్ కమిషన్ అధికారి ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం.