team india: టీమిండియా కంటే మేమే బెటర్: పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్
- ఇంగ్లండ్ లో ఆడటం ఏ ఆసియా జట్టుకైనా పరీక్షే
- దానికి తగ్గట్టుగా సన్నద్ధమవ్వాలి
- భారత్ కంటే మేమే బాగా సన్నద్ధమయ్యామని నాకు అనిపిస్తోంది
ఇంగ్లండ్ గడ్డపై పేలవమైన ఫామ్ తో అష్టకష్టాలు పడుతున్న టీమిండియాపై పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లండ్ టూర్ కోసం ఇండియా కంటే తామే బాగా సన్నద్ధమయ్యామని చెప్పాడు. తాను రెండు సార్లు ఇంగ్లండ్ లో పర్యటించానని... రెండు సార్లూ తమ జట్టు మంచి పోరాటాన్ని ప్రదర్శించిందని అన్నాడు. 2016లో తాను తొలిసారి ఇంగ్లండ్ లో పర్యటించినప్పుడు... టెస్ట్ సిరీస్ ప్రారంభానికి 25 రోజుల ముందే జట్టు సభ్యులంతా అక్కడకు వెళ్లి 10 రోజుల క్యాంపులో పాల్గొన్నామని, రెండు ప్రాక్టీస్ మ్యాచ్ లను కూడా ఆడామని చెప్పాడు. మిస్బా కెప్టెన్సీలో నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను 2-2తో సమం చేశామని తెలిపాడు.
ఈ ఏడాది తన కెప్టెన్సీలో ఇంగ్లండ్ కు ముందే వెళ్లి మూడు ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడామని... ఫలితంగా సిరీస్ ను 1-1తో సమం చేశామని సర్ఫరాజ్ చెప్పాడు. ఇంగ్లండ్ గడ్డపై ఆడేందుకు ఏ ఆసియా జట్టు అయినా చాలా ఇబ్బంది పడుతుందని... దానికి తగ్గట్టుగా మనం సన్నద్ధమవ్వాలని తెలిపాడు. ఇంగ్లండ్ తో ఆడేందుకు భారత్ కంటే తామే బాగా సన్నద్ధమైనట్టు ఒక కెప్టెన్ గా తనకు అనిపిస్తోందని చెప్పాడు. టెస్ట్ సిరీస్ కు ముందు భారత్ కేవలం ఒక్క ప్రాక్టీస్ మ్యాచ్ మాత్రమే ఆడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తొలి రెండు టెస్టులను టీమిండియా కోల్పోయింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ కోహ్లీ, హెడ్ కోచ్ రవిశాస్త్రిలపై విమర్శల వర్షం కురుస్తోంది.