Atal Bihari Vajpayee: దేశం ఓ గొప్ప బిడ్డను కోల్పోయింది!: ఉపరాష్ట్రపతి నివాళులు
- వాజ్ పేయి గొప్ప ప్రధానే కాదు గొప్ప సంఘ సంస్కర్త
- కవిగా, గొప్ప నాయకుడిగా, ఉన్నత వ్యక్తిత్వం ఉన్న మహనీయుడు
- నిజమైన భారతీయుడు అటల్ బిహారీ వాజ్ పేయి అన్న ఉపరాష్ట్రపతి
వాజ్ పేయి అంటే మనమంతా అభిమానించే ఒక గొప్ప ప్రధాని మాత్రమే కాదు, అయన ఒక ఉత్తమ పార్లమెంటేరియన్, గొప్ప సంఘ సంస్కర్త , నిస్వార్ధంగా, నిరాడంబరంగా జీవించిన ఒక మహనీయుడు అని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాళులు అర్పించారు. దేశం ఒక గొప్ప బిడ్డను కోల్పోయిందని గద్గద స్వరంతో పలికిన వెంకయ్య నాయుడు.. వాజ్ పేయ్ క్రమశిక్షణకు మారుపేరని కొనియాడారు. ఆరెస్సెస్స్ ప్రచారక్ గా, భావుకుడైన కవిగా ఆయనను ఏ కోణంలో చూసినా స్పూర్తి ప్రదాతే అని పేర్కొన్నారు.
విద్యార్థి దశ నుంచి ఆయన్ను అభిమానించేవాడినని 'తరుణ హృదయ సామ్రాట్' అని పిలుచుకునే వాడినని అన్నారు. యువతరం గుండెల్లో నిలిచిన గొప్ప నేత తనపై చాలా ఆప్యాయత చూపేవారని.. మార్గనిర్దేశం చేసేవారని అన్నారు ఉపరాష్ట్రపతి. తనపైనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మందిపై అదే ఆప్యాయతను కనబర్చేవారన్నారు.
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి దేశంలో సుస్థిర ప్రభుత్వాన్నిఅందించారని, ఆయన నిజమైన భారతీయుడని కొనియాడారు. మహనీయమైన వ్యక్తిత్వం, చక్కని చాతుర్యంతో ఆయన చేసే ప్రసంగం, బాధ్యతాయుతమైన ఆయన జీవనం, స్నేహానికి ప్రాధాన్యతనిచ్చే గొప్ప లక్షణాలు ఉన్న నాయకుడు అటల్ బిహారీ వాజ్ పేయి అని అన్నారు వెంకయ్య. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేనిదని చెప్పి కన్నీటిపర్యంతమయ్యారు.