Andhra Pradesh: ఉమ్మడి ఏపీతో వాజ్‌పేయికి ప్రత్యేక అనుబంధం!
- హైటెక్ సిటీని ప్రారంభించింది ఆయనే
- చంద్రబాబు, ఎన్టీఆర్‌తో సాన్నిహిత్యం
- ఎన్టీఆర్ కోసం రెండుసార్లు నగరానికి
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో ప్రత్యేక అనుబంధం ఉండేది. ప్రధాని హోదాలోనే ఆయన నాలుగుసార్లు హైదరాబాద్ వచ్చారు. చంద్రబాబు నాయుడిపై అభిమానంతో ఆయన పిలవగానే హైదరాబాద్ వచ్చేవారు. ఎంఎంటీఎస్, గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు (శంషాబాద్ విమానాశ్రయం) మంజూరు చేసింది ఆయనే. ఎన్టీఆర్, చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యంతో జూన్, 2000 సంవత్సరంలో ఇండో-అమెరికన్ కేన్సర్ ఇనిస్టిట్యూట్, రీసెర్చ్ సెంటర్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. 1998లో హైటెక్ సిటీ (సైబర్ టవర్స్) ప్రారంభోత్సవానికి వాజ్‌పేయి హాజరయ్యారు.
వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన (వాంబే) పథకం ప్రారంభోత్సవం, ఏషియాడ్ క్రీడల ముగింపు కార్యక్రమాలకు కూడా వాజ్‌పేయి హాజరయ్యారు. 2004లో హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యారు. 1984లో తన ప్రభుత్వాన్ని పడగొట్టినందుకు ఎన్టీఆర్ నిరసన ఆందోళనకు దిగారు. వాజ్‌పేయి వచ్చి తన మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత తిరిగి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన వెంటనే మరోమారు ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు.