AB Vajpayee: ఆరెస్సెస్‌లోకి రాకముందు ‘కామ్రెడ్ వాజ్‌పేయి!’
- తొలినాళ్లలో కమ్యునిజం భావాలు
- ఏఐఎస్ఎఫ్లో చేరిక
- బాబా సాహెబ్ ఆప్టే ప్రభావంతో ఆరెస్సెస్‌లోకి
మాజీ ప్రధాని, భారతరత్న వాజ్‌పేయి జీవితం గురించి బయటకు తెలిసింది కొంతే. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా కొంత మిగిలే ఉంటుందనేది రాజకీయ విశ్లేషకులు, సన్నిహితుల ఉవాచ. 1942లో అన్నయ్య ప్రేమ్‌తో కలిసి వాజ్‌పేయి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. తమ ప్రసంగాలతో ప్రజలను చైతన్య పరిచారు. దీంతో కన్నుకుట్టిన బ్రిటిష్ ప్రభుత్వం ఇద్దరినీ 23 రోజులపాటు జైలులో నిర్బంధించింది. ఇక, ఆరెస్సెస్‌కు వాజ్‌పేయి వీరాభిమాని అయినప్పటికీ తొలినాళ్లలో ఆయన కమ్యూనిస్టు అనేది చాలామందికి తెలియని విషయం. ఆరెస్సెస్‌లో చేరకముందు వామపక్ష విద్యార్థి సంఘం ఆలిండియా స్టూడెంట్ ఫెడరేషన్ (ఏఐఎస్ఎఫ్)లో చేరారు. ఆ తర్వాత 1939లో బాబా సాహెబ్ ఆప్టే ప్రభావంతో ఆరెస్సెస్‌లో చేరి అంచెలంచెలుగా ఎదిగారు.