Bhadrachalam: భద్రాద్రి వద్ద ఉగ్ర గోదావరి... ధవళేశ్వరం దిగువన అప్రమత్తం!
- భద్రాచలం వద్ద 43 అడుగులకు గోదావరి ప్రవాహం
- మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
- ధవళేశ్వరం వద్ద 7.41 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి
ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి నదికి మరింత వరద వచ్చి చేరింది. నిన్న సాయంత్రం భద్రాచలం వద్ద 40 అడుగులుగా ఉన్న గోదావరి నీటి మట్టం, ఈ ఉదయం 43 అడుగులకు పెరిగింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఈ నీరు మరో 12 గంటల్లో ధవళేశ్వరానికి చేరుకోనుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే ఆనకట్ట నుంచి సముద్రంలోకి 7.41 లక్షల క్యూసెక్కుల నీరు వెళుతుండగా, అది మరో రెండు లక్షల క్యూసెక్కుల వరకూ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
రాజమహేంద్రవరం లంకల్లోకి వెళ్లిన సబ్ కలెక్టర్ సాయికాంత్ వర్మ, ప్రజలను బయటకు రావాలని విజ్ఞప్తి చేశారు. వరద నీరు ముంచెత్తేలోగా, సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని ఆయన సూచించారు. ఇప్పటికే చింతూరు, వీఆర్ పురం, కూనవరం మండలాల్లోని పలు పల్లపు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. దేవీపట్నం వద్ద గోదావరి వరద ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. కచ్చులూరు నుంచి తాడివాడ వరకూ 14 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ధవళేళ్వరం దిగువ ప్రాంత ప్రజలకు సాయంత్రానికి మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశాలు ఉన్నాయని అధికారులు వ్యాఖ్యానించారు.