Vajpayee: వాజ్ పేయి చివరి ఫొటో.. దాని వెనకున్న కథ!

  • 2009 నుంచి ప్రజా జీవితానికి దూరంగా వాజ్ పేయి
  • జ్ఞాపక శక్తిని కోల్పోయి ఇంటికే పరిమితం
  • 2015లో భారతరత్న పురస్కారం వేళ తీసిన ఫొటో
  • ఆపై మరెక్కడా కనిపించని వాజ్ పేయి

2009లో హార్ట్ ఎటాక్ వచ్చిన తరువాత, దాదాపు 9 సంవత్సరాల పాటు ప్రజాజీవితానికి, ప్రత్యక్ష రాజకీయాలకూ దూరంగా ఉండిపోయిన అటల్ బిహారీ వాజ్ పేయి నిన్న సాయంత్రం 5.05 గంటలకు తన తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. 2009 తరువాత ఆయన తన జ్ఞాపక శక్తిని సైతం కోల్పోయి, ఇంటికి మాత్రమే పరిమితం అయ్యారు. ఆయన చివరి సారిగా ప్రాణాలతో కనిపించిన ఫొటో ఏదో తెలుసా? నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, 2015లో భారతరత్న పురస్కారానికి వాజ్ పేయి పేరును ప్రకటించగా, నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్వయంగా న్యూఢిల్లీ, కృష్ణమీనన్ మార్గ్ లోని వాజ్ పేయి నివాసానికి వెళ్లి, పురస్కారాన్ని అందించి వచ్చారు. అప్పుడు తీసిన ఒకే ఒక్క చిత్రాన్ని ప్రభుత్వం మీడియాకు విడుదల చేసింది.

ఆ ఫొటోను సైతం వ్యూహాత్మకంగానే తీశారు. వాజ్ పేయి పూర్తిగా కనిపించకుండా రాష్ట్రపతి సహాయకుడి చేతిని అడ్డు పెట్టించారు. అప్పటికే వాజ్ పేయి కదల్లేని, స్వయంగా స్పందించలేని స్థితిలో ఉండటమే ఇందుకు కారణం. ఆ సమయంలో ఏ జర్నలిస్టునూ లోనికి అనుమతించలేదు. వాజ్ పేయి కళ్లను అద్దాలతో మూసేశారు. ఓ వీల్ చైర్ లో వాజ్ పేయి కూర్చుని ఉండగా, ప్రణబ్ ముఖర్జీ సన్మానిస్తున్నట్టు ఈ చిత్రం కనిపిస్తుంది. రాష్ట్రపతి నిలబడి, వాజ్ పేయి కూర్చుని ఉన్నారంటే, అప్పటికే ఆయన నిలబడే స్థితిలో లేరని తెలుస్తోంది. ఆ తరువాత ఆయన కనిపించిన ఫొటో అంటే, నిన్న మరణించిన తరువాతనే.

  • Loading...

More Telugu News