Vajpayee: మూడు చోట్ల నుంచి పోటీ.. ఒక్క చోటే గెలుపు!
- 1957లో తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన వాజ్ పేయి
- యూపీలోని మూడు చోట్ల నుంచి బరిలోకి
- రెండు చోట్ల ఓటమిపాలైన వాజ్ పేయి
రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలోనే... అంటే తొలిసారిగా 1957లో ఎన్నికల బరిలోకి దిగాలని వాజ్ పేయి నిర్ణయించుకున్న వేళ, ఏకంగా మూడు నియోజకవర్గాల నుంచి లోక్ సభకు పోటీ చేశారు. అన్నప్రాసన రోజే ఆవకాయ ముద్ద తినాలన్న ఆయన ప్రయత్నం బెడిసికొట్టింది. పోటీ చేసిన మూడు నియోజకవర్గాల్లో కేవలం ఒక్క చోటే ఆయన విజయం సాధించారు. యూపీలోని లక్నో, మధుర, బలరాంపూల్ ల నుంచి పోటీ పడగా, మధురలో ఆయన డిపాజిట్ ను కోల్పోయారు. లక్నోలో సైతం ఓటమే ఆయన్ను వరించింది.
ఇక, ముస్లిం జమీందారులు అధికంగా ఉన్న బలరాంపూర్ లో ఆయన అనూహ్య విజయం సాధించారు. చిన్న, మధ్య తరగతి ప్రజలు, రైతులు జనసంఘ్ తరఫున పోటీ చేసిన వాజ్ పేయికి అండగా నిలిచారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ముస్లిం నేత హైదర్ హుస్సేన్ పై దాదాపు 10 వేల ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించిన వాజ్ పేయి, తొలిసారిగా పార్లమెంట్ లో కాలుమోపారు. అప్పుడాయనకు 1.18 లక్షల ఓట్లకు పైగా వచ్చాయి.