Guntur District: వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించినందుకు.. అత్తను చంపేసిన కోడలు!
- గుంటూరు జిల్లా మాచవరం మండలంలో ఘటన
- వివాహేతర బంధంపై మూడు నెలల క్రితం పంచాయతీ
- పుట్టింటికి వెళ్లి తిరిగొచ్చిన తరువాత అత్తను చంపిన కోడలు
వివాహేతర బంధాల మత్తులో మానవ సంబంధాలు ఎలా మంటగలిసిపోతున్నాయో చెప్పకనే చెబుతున్న మరో ఘటన ఇది. గుంటూరు జిల్లా మాచవరం మండలంలోని కొత్తపాలెంలో పరాయి వ్యక్తితో సంబంధం ఎందుకని ప్రశ్నించిన అత్తను దారుణంగా హత్య చేసిందో కోడలు. పోలీసులు వెల్లడించిన మరింత సమాచారం మేరకు, గ్రామానికి చెందిన వీరయ్య, సరోజనమ్మ దంపతుల ఏకైక పుత్రుడు వీరాంజనేయులుకు కారంపూడి సమీపంలోని గుత్తికొండకు చెందిన విజయలక్ష్మితో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. తొలుత అత్తమామలతో కలిసున్న ఈ జంట, ఏడాదిన్నర క్రితం విభేదాలు వచ్చి విడిపోయింది. అప్పటి నుంచి ఇంటి ముందు భాగంలో వీరాంజనేయులు, విజయలక్ష్మి ఉండగా,, వెనుక వైపు తల్లిదండ్రులు నివాసం ఉంటున్నారు.
వీరి ఇంటికి సమీపంలోని మరొకరితో విజయలక్ష్మి వివాహేతరబంధం ప్రారంభించడంతో, విషయం బయటకు వచ్చి, ఇటీవల గ్రామ పెద్దలు పంచాయతీ చేశారు. ఇలా చేయడం తగదని విజయలక్ష్మిని హెచ్చరించడంతో, పుట్టింటికి వెళ్లిన ఆమె, ఇరవై రోజుల క్రితం మళ్లీ తిరిగొచ్చింది. ఈ క్రమంలో వీరాంజనేయులు పనిమీద మాచవరం వెళ్లగా, ఆమె వివాహేతర సంబంధంపై అత్తా కోడళ్ల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి లోనైన విజయలక్ష్మి, పక్కనే ఉన్న రోకలి బండతో అత్త తలపై మోదింది. తీవ్ర గాయాలపాలైన ఆమె, అక్కడికక్కడే మృతిచెందింది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన వీరాంజనేయులు, రక్తపు మడుగులో ఉన్న తల్లిని చూసి భయంతో కేకలు వేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఘటనా స్థలికి చేరుకొని హత్య జరిగిన తీరును విశ్లేషించారు. వీరాంజనేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నామని, విజయలక్ష్మిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని తెలిపారు.