vajpayee: సిద్ధిపేటతో వాజ్ పేయికి మధురానుబంధం.. గుర్తుచేసుకుంటున్న ప్రజలు!
- సిద్ధిపేటకు మూడుసార్లు వచ్చిన వాజ్ పేయి
- పార్టీ నిధుల కోసం 1983లో తొలిసారి
- బీజేపీ అభ్యర్థి తరఫున ప్రచారంలో పాల్గొన్న అటల్ జీ
దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయికి తెలంగాణలోని సిద్ధిపేట ప్రాంతంతో విడదీయరాని అనుబంధం ఉంది. జన్ సంఘ్ లో నేతగా ఉన్నప్పుడే 1975 ఏప్రిల్ 14న తొలిసారి వాజ్ పేయి సిద్ధిపేటకు వచ్చారు. జన్ సంఘ్ కార్యకలాపాల విస్తరణలో భాగంగా సిద్ధిపేట పట్టణంలోని పాతగంజి ప్రాంతంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ పటిష్టత కోసం నిధుల సేకరణ, కేడర్ నిర్మాణంపై వాజ్ పేయి దృష్టి సారించారు. ఈ సందర్భంగా పార్టీ పటిష్టత, చురుగ్గా పనిచేస్తున్న నేతలు, ప్రజల నుంచి లభిస్తున్న మద్దతు సహా పలు అంశాలపై దృష్టి పెట్టారు.
అనంతరం 1983లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో సిద్ధిపేట బీజేపీ అభ్యర్థి నిమ్మ నర్సింహారెడ్డి తరఫున ప్రచారంలో వాజ్ పేయి పాల్గొన్నారు. వాజ్ పేయి సిద్ధిపేటలో చివరిగా కాలుపెట్టింది 1988లోనే. అప్పుడు కరీంనగర్ లో జరుగుతున్న పార్టీ సమావేశానికి వెళ్తూ సిద్ధిపేటలోని పాత బస్టాండ్ సమీపంలో ఆగారు. దీంతో బీజేపీ శ్రేణులు, స్థానికులు ఆయన్ను ఘనంగా సన్మానించారు. కాగా మాజీ ప్రధాని వాజ్ పేయి ఇక లేరన్న వార్తతో సిద్ధిపేట బీజేపీ శ్రేణులు తీవ్ర మనోవేదనకు గురయ్యాయి. పలువురు స్థానికులు వాజ్ పేయి ఇక్కడకు వచ్చి గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటున్నారు.