vajpayee: ఆదర్శవంతమైన స్త్రీ కోసం వెతుకుతున్నా.. అందుకే పెళ్లి కాలేదు!: వెంటపడ్డ మహిళా జర్నలిస్టుకు వాజ్ పేయి ఝలక్
- మీడియాకు విందు ఏర్పాటు సందర్భంగా ఫన్నీ ఘటన
- ఒకే ప్రశ్నతో ఇబ్బందిపెట్టిన మహిళా జర్నలిస్ట్
- వ్యంగ్యంగా జవాబిచ్చిన వాజ్ పేయి
దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి పెళ్లి చేసుకోకుండా జీవితాంతం అవివాహితుడిగానే ఉండిపోయారు. తనకు పెళ్లి చేసుకునే తీరికే లేదని పలుమార్లు వాజ్ పేయి మీడియాతో అన్నారు. అయినా కొంతమంది జర్నలిస్టులు మాత్రం వాజ్ పేయి ఏదో దాస్తున్నారని భావించడం మొదలుపెట్టారు. ఆయన నోటితోనే ఆ నిజాన్ని చెప్పించాలని ప్లాన్ వేశారు.
1999లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక వాజ్ పేయి మీడియాకు ఓ సారి విందు ఏర్పాటు చేశారు. దానికి చాలా పత్రికలు, న్యూస్ చానెళ్ల జర్నలిస్టులు హాజరయ్యారు. విందుకు వచ్చిన ప్రతిఒక్కరిని వాజ్ పేయి దగ్గరకు వెళ్లి పలకరించడం మొదలుపెట్టారు. అందరూ నవ్వుతూ జవాబిస్తున్నారు. అయితే ఇంతలో ఓ మహిళా జర్నలిస్ట్ ఆయన్ను ‘ప్రధాని గారూ.. మీరు ఎందుకు పెళ్లి చేసుకోలేదో ఇప్పటివవరకూ చెప్పలేదు’ అని అడిగింది. దీంతో వాజ్ పేయి నవ్వుతూ అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు.
అయినా సదరు మహిళా జర్నలిస్ట్ వాజ్ పేయిని వదిలిపెట్టలేదు. ఇదే ప్రశ్నను మరో మూడుసార్లు అడిగింది. దీంతో ఆయనకు ఓపిక నశించి ‘నేను ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే.. ఆదర్శవంతమైన భార్య కాగల స్త్రీ కోసం వెతుకుతున్నాను’ అని జవాబిచ్చారు. వెంటనే సదరు రిపోర్టర్ ‘ఏంటి? అలాంటి ఆదర్శ స్త్రీ మీకు జీవితంలో ఇంతవరకూ దొరకలేదా?’ అని మరో సారి ప్రశ్నించింది.
దీంతో వాజ్ పేయి నవ్వుతూ.. ‘దొరికింది కానీ.. తాను కూడా ఆదర్శవంతమైన భర్తగా ఉండే వ్యక్తి కోసం వెతుకుతోందట’ అని జవాబిచ్చారు. దీంతో సదరు జర్నలిస్ట్ వాజ్ పేయిని ప్రశ్నలతో వేధించడం ఆపి అక్కడి నుంచి వెళ్లిపోయింది. తాను అవివాహితుడిని మాత్రమేనని, బ్రహ్మచారిని కాదని పలుమార్లు వాజ్ పేయినే స్వయంగా చెప్పుకున్నారు.