Atal Bihari Vajpayee: ప్రియనేత కడసారి చూపు కోసం.. బహుదూరపు అభిమానులు!
- సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న అభిమానులు
- దేశ వ్యాప్తంగా వాజపేయికి నివాళులర్పిస్తున్న ప్రజలు
- ఉత్తరకాశీ నుంచి వచ్చిన యోగేశ్ బృందం
మాజీ ప్రధాని వాజ్ పేయికి దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. దివంగత ప్రధాని సందర్శనార్ధం ప్రజలు క్యూ కడుతున్నారు. ఆయన పార్ధివ దేహాన్ని కృష్ణమీనన్ మార్గ్‌లోని ఆయన నివాసంలో ప్రజలు దర్శించుకున్నారు. తర్వాత భాజపా ప్రధాన కార్యాలయంలో వుంచి అక్కడ నుండి అంతిమ యాత్ర కొనసాగించనున్నారు.
వాజ్ పేయి మరణ వార్త విన్న ఎందరో శోక తప్త హృదయాలతో కడసారి దర్శనానికి ఢిల్లీ చేరుకున్నారు. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీకి చెందిన యోగేశ్ కుమార్ అనే వ్యక్తి తన బృందంతో కలిసి ఢిల్లీ చేరుకొని వాజ్ పేయి భౌతికకాయానికి నివాళులర్పించారు. రాత్రంతా దాదాపు 500 కిలోమీటర్లు ప్రయాణించి దేశరాజధానికి చేరుకున్న వీరు ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని చెప్పారు.
1984లో వాజ్‌పేయి గంగోత్రికి వెళ్తుండగా మధ్యలో ఉత్తరకాశీలో పర్యటించారు. ఆ సమయంలో వాజ్‌పేయీని కలిశానని యోగేశ్ కుమార్ చెప్పారు. ఆయన కోసం గంగాజలం తీసుకు వచ్చానని చెప్పిన యోగేశ్ కుమార్, గొప్ప నాయకుడైన వాజ్ పేయి మరణాన్ని తట్టుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.