i phone: చనిపోయిన వ్యక్తికి ‘ఐ ఫోన్’ లోన్.. ఉద్యోగులను కటకటాల వెనక్కి నెట్టిన పోలీసులు!
- రూ.80 వేలు రుణం మంజూరు చేసిన ఫైనాన్స్ సంస్థ
- తప్పుడు డాక్యుమెంట్లతో కంపెనీకి కుచ్చుటోపి
- ఇద్దరు ఉద్యోగులను అరెస్ట్ చేసిన పోలీసులు
గుజరాత్ లో ఓ వ్యక్తి ఐ ఫోన్ ను కొనేందుకు ఓ ఫైనాన్స్ సంస్థ నుంచి రుణం తీసుకున్నాడు. అయితే తొలి వాయిదాను చెల్లించకపోవడంతో సదరు వ్యక్తి ఇంటికి వెళ్లిన అధికారులు విస్తుపోయారు. ఎందుకంటే లోన్ తీసుకునేందుకు కొద్దిరోజుల ముందే ఆ వ్యక్తి చనిపోయాడు. దీంతో సదరు కంపెనీ ప్రతినిధులు పోలీసులను ఆశ్రయించగా, ఈ వ్యవహారాన్ని నడిపించిన ఇద్దరు ఇంటి దొంగలను అధికారులు కటకటాల వెనక్కి నెట్టారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అహ్మదాబాద్ లోని లాల్ దర్వాజా ప్రాంతంలో ఉంటున్న భవస్కర్ ఇక్కడి ఫైనాన్స్ సంస్థ టాటా కేపిటల్ నుంచి ఈ ఏడాది జనవరి 26న ఐఫోన్ కోసం రూ. 80 వేలు తీసుకున్నాడు. అయితే మొదటి నెల వాయిదా చెల్లించకపోవడంతో అతడి ఇంటికెళ్లిన సంస్థ ప్రతినిధులు అతను లోన్ తీసుకోవడానికి మూడు రోజులకు ముందే చనిపోయినట్లు తెలుసుకుని షాక్ కు గురయ్యారు. తేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ ప్రారంభించిన పోలీసులు కస్టమర్ రిలేషన్ విభాగంలో పనిచేస్తున్న చైతన్య పటేల్, ధ్రుకేష్ పటేల్ లు తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించి లోన్ తీసుకున్నారని గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు నెట్టారు.