Lovers: రక్షణ కోసం ఎస్పీని ఆశ్రయించిన మూడు ప్రేమజంటలు!
- మూడు జంటల ప్రేమ పెళ్లిళ్లు
- పెద్దలు నిరాకరించటమే కారణం
- వేలూరు ఎస్పీ ఆఫీస్ కు చేరిన కథలు
వారంతా వేరు వేరు గ్రామాలకు చెందిన వారు. ఆ మూడు జంటలు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వారి పెళ్ళికి పెద్దలు నిరాకరించటంతో మూడు జంటలు పారిపోయి వేరు వేరు చోట్ల పెళ్లి చేసుకున్నారు. తమకు రక్షణ కల్పించమని, పెద్దల నుండి తమను కాపాడమని మాత్రం ఒకేరోజు మూడు జంటలు వేలూరు ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు.
ఒక్కో జంటది ఒక్కో కథ... తమిళనాడులోని వేలూరు జిల్లా కేవీ కుప్పంకు చెందిన బిఎస్సీ చదువుతున్న జ్యోతిక, అదే గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ సతీష్‌కుమార్ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాల వారు ఒప్పుకోకపోవటంతో రెండు రోజుల క్రితం ఇద్దరూ ఇంటినుంచి వెళ్ళిపోయి వివాహం చేసుకున్నారు.
అదే విధంగా నాట్రంబల్లి సమీపంలోని పచ్చూరు గ్రామానికి చెందిన డిగ్రీ చదువుతున్న జయశ్రీ పాతపేటకు చెందిన మయిల్ వాణన్ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మయిల్‌వాణన్ ఒడిసా రాష్ట్రంలోని ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. వీరి వివాహానికి ఇద్దరి తల్లిదండ్రులు అంగీకరించకపోవటంతో వారు 13వ తేదీన వివాహం చేసుకున్నారు.
ఇక మూడో జంట ఆంబూరు బీకస్పా ప్రాంతానికి చెందిన ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్న దివ్యభారతి అదే గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి వివాహానికి పెద్దలు నో అన్నారు. దివ్య భారతికి వేరే వివాహం చేసేందుకు కూడా పెద్దలు నిర్ణయించారు. పారిపోయి ఇద్దరూ 11వ తేదీన తిరువణ్ణామలైలోని ఆలయంలో వివాహం చేసుకున్నారు. గ్రామాలేమైనా, ఎక్కడ పెళ్లి చేసుకున్నా చివరకు రక్షణ కల్పించమని వేలూరు ఎస్పీ ఆఫీస్ కు చేరుకున్నారు ఈ మూడు ప్రేమ జంటలు. అందరూ మేజర్లు కావటంతో తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు పోలీస్ అధికారులు.