Kerala: కేరళలో ప్రకృతి బీభత్సం.. లక్షన్నర మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు
- ఇప్పటికే 323 మందికి పైగా మృతి
- రాష్ట్ర వ్యాప్తంగా 14 జిల్లాల్లో రెడ్ అలర్ట్
- కొనసాగుతున్న సహాయక చర్యలు
కేరళలో తొమ్మిది రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రం అతలాకుతలమైపోయింది. 324 మందికి పైగా మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా 14 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. నదులు, వాగులు పోటెత్తడంతో పలు గ్రామాలు నీట మునిగాయి. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రెండు లక్షల పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే లక్షన్నర మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాలు పాల్గొన్నాయి.
కేరళలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వేలాది ఇళ్లు నేలమట్టం కాగా, 12 జిల్లాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్లు దెబ్బతిన్నాయి. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. రవాణాసౌకర్యాలకు తీవ్ర అంతరాయం కలిగింది. కేరళలో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగగా, 25 రైళ్లను రద్దు చేశారు. కొచ్చిలో మెట్రో రైల్ సేవలను నిలిపివేశారు. ఈ నెల 26 వరకు కొచ్చి ఎయిర్ పోర్టును మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. కాగా, సహాయక చర్యల నిమిత్తం కేరళకు అదనపు బలగాలను కేంద్రం తరలించింది.