Vajpayee: ఫ్లాష్ బ్యాక్: చైనా ఆరోపణలకు కౌంటర్.. చైనా ఎంబసీకి 800 గొర్రెలు తోలుకెళ్లిన వాజ్‌పేయి!
- పశువుల కాపరి నుంచి గొర్రెలు అపహరించినట్టు ఆరోపణ
- తమకేమీ తెలియదన్న భారత ప్రభుత్వం
- చైనా ఎంబసీ ఎదుట వాజ్‌పేయి ఆందోళన
గొర్రెల పేరుతో చైనా మూడో ప్రపంచ యుద్ధానికి కాలు దువ్వుతోందని ఆరోపిస్తూ అప్పట్లో వాజ్‌పేయి డ్రాగన్ కంట్రీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని చైనా ఎంబసీకి ఏకంగా 800 గొర్రెలను తోలుకెళ్లి నిరసన తెలిపారు. వాజ్‌పేయి చేసిన పనికి చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. 1965లో జరిగిందీ ఘటన.
సిక్కిం విషయంలో భారత్-చైనా మధ్య వివాదం మొదలైంది. అదే సమయంలో టిబెట్‌కు చెందిన ఓ పశువుల కాపరి వద్ద నుంచి భారత దళాలు 800 గొర్రెలు, 49 జడల బర్రెలను దొంగిలించారని చైనా ఆరోపించింది. వెంటనే వాటిని తిరిగి ఇవ్వాలని, లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది. చైనా ఆరోపణలను భారత్ ఖండించింది. ఆరోపణల్లో వాస్తవం లేదని తేల్చి చెప్పింది. చైనా చెబుతున్న గొర్రెల గురించి తమకేమీ తెలియదని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
అప్పట్లో వాజ్‌పేయి ఎంపీగా ఉన్నారు. చైనా అసత్య ఆరోపణలపై మండిపడిన ఆయన 800 గొర్రెలను చైనా ఎంబసీకి తోలుకెళ్లి కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ‘మమ్మల్ని తినండి.. ప్రపంచాన్ని మాత్రం కాపాడండి’ అంటూ రాసున్న ప్లకార్డులను వాటిపై ప్రదర్శించారు. గొర్రెల పేరుతో చైనా మూడో ప్రపంచ యుద్ధానికి కాలుదువ్వుతోందని ఆరోపించారు.