Andhra Pradesh: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. మరో మూడు రోజులు భారీ వర్షాలు.. అధికారుల హెచ్చరిక
- ఆగ్నేయాసియా దిశగా వాయుగుండం కేంద్రీకృతం
- భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
- అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించిన అధికారులు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కోస్తా, ఒడిశా పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోందని తెలిపారు. చత్తీస్గఢ్, విదర్భ ప్రాంతాల్లో తూర్పు ఆగ్నేయ దిశగా కేంద్రీకృతం అయిందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తుండగా, కేరళ సహా దేశవ్యాప్తంగా వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కేరళలో అయితే పరిస్థితి మరింత దుర్భరంగా ఉంది. 323 మంది మరణించగా, లక్షల్లో జనం నిరాశ్రయులయ్యారు. 14 జిల్లాల్లో ప్రభుత్వం రెడ్ అలెర్ట్ ప్రకటించింది. నేడు ప్రధాని కేరళలోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు.