Andhra Pradesh: ఉగ్రరూపం దాల్చిన గోదావరి నది.. లంక గ్రామాలకు సంబంధాలు కట్.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ!
- ఎగువ నుంచి వస్తున్న నీటితో గోదావరి ఉగ్రరూపం
- రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు
- బిక్కుబిక్కుమంటున్న లంక గ్రామాలు
గోదారమ్మ ఉగ్ర రూపం దాల్చింది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో ఉప్పొంగి ప్రవహిస్తోంది. దవళేశ్వరం వద్ద శుక్రవారం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు తాజాగా రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ధవళేశ్వరం వద్ద ఈ ఉదయానికి నీటి మట్టం మరింత పెరిగి 14.6 అడుగులకు చేరుకోవడంతో అధికారులు గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని వదులుతున్నారు.
బ్యారేజీ నుంచి నీరు ఒక్కసారిగా దిగువకు వస్తుండడంతో లంక గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. చాలా ప్రాంతాల్లో కాజ్వేలు మునిగిపోయాయి. లంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో ప్రయాణాలకు నాటు పడవలను ఉపయోగిస్తున్నారు. విషయం తెలిసిన అధికారులు నాటు పడవలు ఉపయోగించవద్దంటూ హెచ్చరిస్తున్నారు.