IMRAN KHAN: ఇమ్రాన్ ఖాన్ సవాలుతో నా రిటైర్మెంట్ ఓ ఏడాది వాయిదా పడింది: సునీల్ గవాస్కర్
- 1986లోనే రిటైర్ కావాలనుకున్నా
- కానీ ఇమ్రాన్ మాత్రం ఏడాది ఆగమన్నాడు.
- టెస్ట్ సిరీస్ లో భారత్ ను ఓడిస్తానని సవాల్ చేశాడు
పాక్ కొత్త ప్రధాని ఇమ్రాన్ ఖాన్, భారత క్రికెటర్ సునీల్ గవాస్కర్ లు మంచి స్నేహితులు. ప్రత్యర్థి జట్లలో ఉన్నప్పటికీ వీరిద్దరి మధ్య స్నేహం కొనసాగింది. తాజాగా పాక్ 22వ ప్రధానిగా బాధ్యతలు చేపడుతున్న ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారానికి వ్యక్తిగత కారణాలతో గవాస్కర్ వెళ్లలేకపోయారు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన విషయాన్ని గవాస్కర్ అభిమానులతో పంచుకున్నారు.
కేవలం ఇమ్రాన్ చాలెంజ్ తో తన రిటెర్మెంట్ ఓ ఏడాది పాటు వాయిదా పడిందని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చారు. ‘1986లో లండన్ లోని ఓ ఇటాలియన్ రెస్టారెంట్ లో నేను, ఇమ్రాన్ కలసి భోజనం చేస్తున్నాం. ఈ సందర్భంగా తర్వాతి టూర్ లో నన్ను సెలక్ట్ చేయకుంటే రిటెర్మెంట్ తీసేసుకుంటాను అని ఇమ్రాన్ కు చెప్పాను. దీనికి ఇమ్రాన్ స్పందిస్తూ.. 'నువ్వు ఇప్పుడు రిటైర్ కావడానికి వీలులేదు. వచ్చే సంవత్సరం పాకిస్తాన్ ఇండియా టూర్ కు వస్తుంది. నేను ఇండియాను ఇండియాలోనే ఓడిస్తాను. నువ్వు జట్టులో లేకపోతే నా పని ఇంకా సులువై పోతుంది. ఆగిపో. చివరిగా ఓసారి మనమిద్దరం ముఖాముఖి తలపడదాం’ అని ఇమ్రాన్ తనను ఉడికించినట్లు గవాస్కర్ చెప్పారు.
ఇమ్రాన్ సవాలుతో ఈ సిరీస్ ను గెలవాలన్న కసి తనలో పెరిగిందని గవాస్కర్ అన్నారు. పాకిస్తాన్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో అన్ని మ్యాచ్ లను డ్రా చేసుకున్న టీమిండియా చివరి మ్యాచ్ లో మాత్రం పాక్ చేతిలో ఓడిపోయిందని వెల్లడించారు. దీంతో ఇమ్రాన్ చెప్పినట్లే టెస్ట్ సిరీస్ పాకిస్తాన్ వశమైందని ఆ రోజులను గుర్తుచేసుకున్నారు.