kerala: కేరళ కోసం కదిలొచ్చిన హీరోలు.. ఎవరెవరు ఎంతిచ్చారంటే..!

  • విరాళాలు ప్రకటిస్తున్న నటులు
  • ముందుకు రావాలంటూ అభిమానులకు పిలుపు
  • స్ఫూర్తిగా నిలుస్తున్న చిత్రపరిశ్రమ

జలవిలయంలో అతలాకుతలం అవుతున్న కేరళను ఆదుకునేందుకు సినీ నటులు ముందుకొచ్చారు. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ నటులు ముందుకొచ్చి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆర్థికసాయం ప్రకటించి తమకు తోచినంత విరాళం ఇచ్చారు. జల దిగ్బంధం నుంచి కేరళ వాసులు త్వరగా బయటపడాలని ఆకాంక్షించారు. బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాల్సిందిగా అభిమానులకు పిలుపునిచ్చారు.

తెలుగు చిత్రపరిశ్రమ నుంచి అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ కేరళ సీఎం సహాయ నిధికి విరాళం ప్రకటించారు. అల్లు అర్జున్ రూ.25 లక్షల విరాళం ప్రకటించగా విజయ్ దేవరకొండ రూ.5 లక్షలు ఇచ్చారు. కేరళ ప్రజలు తనపై చూపిన ప్రేమానురాగాలు ఎనలేనివని పేర్కొన్న అల్లు అర్జున్ వారికి తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుందన్నాడు. తనవంతు సాయంగా రూ.25 లక్షలు ప్రకటిస్తున్నట్టు ట్వీట్ చేశాడు. రూ.5 లక్షల విరాళం ప్రకటించిన విజయ్.. కేరళ వాసులను ఆదుకునేందుకు ముందుకు రావాలంటూ యువతకు పిలుపునిచ్చాడు. నిర్మాత బన్నీ వాసు ‘గీత గోవిందం’ సినిమా కేరళ వసూళ్లను సీఎం సహాయనిధికి విరాళంగా ప్రకటించాడు.  

కోలీవుడ్ చిత్ర పరిశ్రమ కూడా కేరళను ఆదుకునేందుకు ముందుకొచ్చింది. స్టార్ హీరోలు కమలహాసన్, సూర్య- కార్తి, విజయ్ సేతుపతి రూ. 25 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. సూర్య ప్రత్యేకంగా ‘అమ్మ’ ఫండ్‌కు రూ.10 లక్షల విరాళం అందించారు. తనవంతుగా రూ.10 లక్షల విరాళం ప్రకటించిన మరో నటుడు సిద్ధార్థ్ విరాళాల సేకరణకు సోషల్ మీడియా చాలెంజ్‌ను ప్రారంభించాడు. నటులు ధనుష్ రూ.15 లక్షలు, విశాల్, శివకార్తికేయన్ రూ.10 లక్షల చొప్పున విరాళం ప్రకటించగా, సన్ టీవీ నెట్‌వర్క్ రూ. కోటి విరాళం ప్రకటించింది.

 ఇక మాలీవుడ్ స్టార్ హీరోలైన మోహన్‌లాల్, మమ్ముట్టి రూ.25 లక్షల చొప్పున విరాళం అందించారు. మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ రూ.50 లక్షలు అందజేసింది. యువ నటుడు తొవినో థామస్ తన ఇంటిలో బాధితులకు ఆశ్రయం కల్పించాడు. పరిస్థితులు చక్కబడే వరకు బాధితులకు సరుకులు అందించనున్నట్టు తెలిపాడు.

  • Loading...

More Telugu News