fisherman: ప్రాణాల కోసం ఆరు గంటలు సముద్రంలో ఈత.. ఓ జాలరి సాహసం!

  • సముద్రంలో పడిపోయిన జాలరి నాగరాజ్
  • ఆరు గంటలు సముద్రంలోనే ఈత
  • కాపాడిన కోస్ట్ గార్డ్ సిబ్బంది

కంటికి కనిపించినంత మేర నీలిరంగులో ఉండే సముద్రంలోకి వెళ్లాలంటేనే చాలామందికి బెరుకు. అలాంటిది అందులో పడిపోయి, సాయం చేసేవారు లేక ఆరు గంటల పాటు ప్రాణ భయంతో అల్లాడిపోవడాన్ని ఊహించుకోగలమా? తమిళనాడుకు చెందిన నాగరాజ్ అనే జాలరికి ఈ భయంకర అనుభవం ఎదురైంది. గురువారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

నాగరాజ్ తన సహచరులతో కలసి గురువారం ఉదయం సముద్రంలోకి వేటకు వెళ్లాడు. ఆరంభంలో బాగానే ఉన్నా సాయంత్రం కాగానే భారీ అలల కారణంగా పడవలు అటూఇటూ ఊగిపోయాయి. దీంతో నాగరాజ్ ఒక్కసారిగా సముద్రంలోకి పడిపోయాడు. అతనితో పాటు వచ్చిన 40 జాలర్లు గాలించినా నాగరాజ్ ఆచూకీ లభించలేదు. మరో మర్గం లేకపోవడంతో జాలర్లు తీరానికి చేరుకున్నారు.

సముద్రంలో పడిపోయిన నాగరాజ్ కు చుట్టుపక్కల ఏమీ కనిపించలేదు. ఎంతగా అరిచినా ఎవ్వరూ అందుబాటులో లేరు. దీంతో నీటి అలలకు దూరంగా కొట్టుకుపోకుండా, శరీరం తొందరగా అలసిపోకుండా కొద్దికొద్దిగా కాళ్లు, చేతులు కదిలిస్తూ నాగరాజ్ అక్కడే ఉండిపోయాడు. ఇలా ఆరు గంటల పాటు అతను పోరాడాడు. ఒడ్డుకు చేరుకున్న జాలర్లు మంగళూరు లోని కోస్ట్ గార్డులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన కోస్ట్ గార్డ్ సిబ్బంది గాలింపు చేపట్టారు. చివరికి ప్రాణాలతో నీటిపై తేలుతున్న నాగరాజ్ ను అధికారులు రక్షించారు.

  • Loading...

More Telugu News