kerala: కేరళకు విజయ డైరీ నుంచి పాలపొడి పంపించనున్న ‘తెలంగాణ’ ప్రభుత్వం
- కేరళకు 20 టన్నుల పాలపొడిని పంపిస్తున్నాం
- దీని విలువ రూ.40 లక్షల వరకు ఉంటుంది
- కేరళకు సాయమందించేందుకు సిద్ధం: మంత్రి తలసాని
వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన కేరళ రాష్ట్రానికి సహాయక చర్యల్లో భాగంగా పాలపొడిని పంపించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. విజయ డెయిరీ నుంచి రూ.40 లక్షల విలువైన 20 టన్నుల పాలపొడిని పంపించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు సంబంధిత మంత్రులు, అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ,
ఇరవై టన్నుల పాలపొడిని ఈరోజే పంపనున్నామని, రాష్ట్రం తరపున కేరళకు అవసరమైన సాయమందించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.
కాగా, నాచారంలోని తెలంగాణ ఫుడ్స్ నేతృత్వంలో ఆహారపదార్థాలను కేరళకు ఈరోజు పంపారు. చిన్నారుల కోసం 100 మెట్రిక్ టన్నుల పౌష్టికాహారాన్ని బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి రక్షణ శాఖకు చెందిన విమానం ద్వారా ఈరోజు ఉదయం కేరళకు పంపారు. ఈ పౌష్టికాహారం విలువ దాదాపు రూ.52.50 లక్షలు ఉంటుందని సమాచారం. ఇదిలా ఉండగా, కేరళకు తమిళనాడు రాష్ట్రం వరద సాయం అందించింది. రూ.5 కోట్ల ఆర్థికసాయంతో పాటు 300 టన్నుల పాలపొడి, 500 టన్నుల బియ్యం సాయం అందించింది.