Mumbai: ప్రియురాలిని క్షమించమని అడిగేందుకు... ప్రియుడి నిర్వాకం!
- 300 భారీ హోర్డింగుల ఏర్పాటు
- ఆమె నడిచే దారిలో ఏర్పాటు చేసిన ప్రియుడు
- గుర్తించి అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు
తనపై ఆగ్రహంతో ఉన్న ప్రియురాలిని ప్రసన్నం చేయించుకునేందుకు ఆ ప్రియుడు చేసిన పనిని చూసి అవాక్కయ్యారు పోలీసులు, ప్రజలు. నిత్యమూ ముంబై నుంచి పింప్రి చించ్ వాడ్ ప్రాంతానికి వచ్చే తన ప్రియురాలికి 'సారీ' చెప్పేందుకు 300 హోర్డింగులను పెట్టించాడు నీలేశ్ ఖేడేకర్ అనే 25 ఏళ్ల యువకుడు. ఆ అమ్మాయి పేరు చెబుతూ, తనను క్షమించాలంటూ ఓ లవ్ సింబల్ తో ఈ హోర్డింగ్ లను పెట్టించాడు.
ఈ విషయం గురించి తెలుసుకున్న పోలీసులు, ప్రజల ఆస్తిని చెడగొట్టడం, అనుమతులు తీసుకోకుండా అక్రమ హోర్డింగ్ లు పెట్టడం వంటి కేసులు నమోదు చేశారు. అతని ప్రియురాలు ముంబై నుంచి ఈ ప్రాంతానికి నిత్యమూ వస్తుందని, ఆమె వచ్చే దారిలో నీలేశ్ 300 హోర్డింగులను పెట్టించినట్టు గుర్తించామని తెలిపారు. నీలేశ్ మిత్రుడు విశాల్ షిండే సాయంతో అతన్ని అదుపులోకి తీసుకున్నామని, పింప్రి మునిసిపల్ అధికారులకు సమాచారం ఇచ్చామని, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.